- వెంటనే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి పోస్టులు భర్తీ చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకాలకు సంబంధించి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. జస్టిస్ దీపాంకుర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు నేతృత్వంలోని ధర్మాసనం 'స్వాతి అరికెల వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం' కేసును విచారించింది. రాష్ట్రంలో ప్రాథమిక విభాగంలో 796, అప్పర్ ప్రైమరీ-సెకండరీ విభాగాల్లో 727 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉండగా.. వరుసగా 251, 261 ఖాళీలు ఉన్నట్లు కోర్టు గుర్తించింది.
నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్‌ను (ఐఈఆర్పీ) నేరుగా నియమించడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది గత కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. తక్షణమే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి, ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరినీ స్క్రీనింగ్ చేయాలని ఆదేశించింది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేస్తూ.. ఈ ఆదేశాలు వెలువడిన రోజు నుంచి 8 వారాల్లోగా కేసు పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
