
- సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- మైసూరు ఉత్సవాలకు ముస్తాక్‌కు ఆహ్వానంపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: సర్కారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా వేడుకలను ఓ సెక్యులర్ ఈవెంట్‌గా చూడాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. కర్నాటక రాష్ట్రంలో మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్విన్నర్, కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ.. వేడుకల ప్రారంభోత్సవంపై ఎలాంటి వివాదం లేదని, కానీ.. ఈ సందర్భంగా చాముండేశ్వరి దేవత విగ్రహానికి పూలమాల వేయాల్సి ఉంటుందని, వేదాలను పఠించాలని తెలిపారు.
ఇది మతపరమైన కార్యక్రమమని, దీన్ని ప్రారంభించడానికి బాను ముస్తాక్ తగిన వారు కాదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఇది ప్రైవేట్ కార్యక్రమం కాదని, ప్రభుత్వం నిర్వహిస్తున్నదని తెలిపింది. దసరా ఓ సెక్యులర్ ఈవెంట్ అని పేర్కొన్నది. ఇలాంటి కార్యక్రమాల్లో రాష్ట్రం ఏ,బీ, సీల మధ్య భేదం చూపలేదని తెలిపింది.
సామాజిక సేవ చేస్తే మీకేంటి సమస్య?
విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం– 2010 (ఎఫ్సీఆర్ఏ చట్టం) కింద ఒక సంస్థ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పైజస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విదేశీ విరాళాల దుర్వినియోగం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, సంస్థను మరింత ఇబ్బంది పెట్టవద్దని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ స్పష్టం చేసింది. వారు సామాజిక సేవ చేస్తుంటే మీకేంటి సమస్య అని కేంద్ర సర్కారుపై మండిపడింది.