ఎంఐఎం రిజిస్ట్రేషన్ రద్దు పిటిషన్‌ తిరస్కరణ

 ఎంఐఎం రిజిస్ట్రేషన్ రద్దు పిటిషన్‌ తిరస్కరణ
  •  కొత్త రిట్ పిటిషన్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు 

న్యూఢిల్లీ, వెలుగు: ఆల్ ఇండియా మజ్లిస్ -ఎ -ఇత్తెహాదుల్ ముసలిమీన్ (ఏఐఎంఐఎం) రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే, మతపరమైన లక్ష్యాలతో కూడిన రాజకీయ పార్టీల చెల్లుబాటుపై విస్తృత అంశాలను లేవనెత్తుతూ కొత్త రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి పిటిషనర్ తిరుపతి నరసింహ మురారికి అనుమతి ఇచ్చింది. ఏఐఎంఐఎం రిజిస్ట్రేషన్‌ను సవాల్ చేస్తూ మురారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆ కోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.బుధవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీల ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదిస్తూ.. ఏఐఎంఐఎంకు ముస్లిం సమాజానికి సేవ చేయడమే లక్ష్యమని, ఇది లౌకిక సూత్రాలను ఉల్లంఘిస్తున్నదని వాదించారు. 

అందువల్ల ఆ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. ఏఐఎంఐఎం రాజ్యాంగం ప్రకారం అన్ని వెనుకబాటు వర్గాల హక్కుల కోసం పనిచేస్తోందని, రాజ్యాంగం ప్రకారమే మతపరమైన చట్టాలకు రక్షణ ఉందని తెలిపింది. అంటరాని తనాన్ని ప్రోత్సహిస్తేనే నిషేధం అవసరమని స్పష్టం చేసింది. జైన్ బదులిస్తూ.. హిందూ పేరుతో వేదాలు, ఉపనిషత్తులు బోధిస్తామని చెబితే ఎలక్షన్ కమిషన్ రిజిస్ట్రేషన్‌కు అనుమతివ్వదన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. కులం, ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే పార్టీలు కూడా ప్రమాదకరమని తెలిపింది. ఏ పార్టీనీ ప్రత్యేకంగా పేర్కొనకుండా సాధారణ అంశాలను లేవనెత్తే కొత్త పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ప్రస్తుత పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.