
- ఎన్నికల పిటిషన్లపై విచారణ ముగించాలని వేసిన రెండు ఎస్ఎల్పీల కొట్టివేత
- ప్రతివాదుల పిటిషన్లు విచారణకు అర్హమైనవన్న కోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ ప్రతివాదులు దాఖలు చేసిన పిటిషన్లు విచారణకు అర్హమైనవని స్పష్టం చేసింది. ఆ పిటిషన్లు కొట్టివేయాలని గోపీనాథ్ దాఖలు చేసిన రెండు స్పెషల్ లీవ్ పిటిషన్ల(ఎస్ఎల్పీ)ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గోపీనాథ్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పై విజయం సాధించారు.
అయితే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ –1951 నిబంధనల ప్రకారం గోపీనాథ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ అజారుద్దీన్, ఓటరు వి. నవీన్ యాదవ్ తో పాటు మరో 19 మంది హైకోర్టును ఆశ్రయించారు. వీవీప్యాట్ లు, ఏజెంట్ల లెక్కలు ట్యాలీ కాలేదని అజారుద్దీన్.. విద్యార్హతల్లో తప్పుడు సమాచారం పొందుపర్చారని ఓటర్లు కోరారు. వీటిపై మాగంటి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ ను 2024 సెప్టెంబరు18న హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసిజర్(సీపీసీ)లోని నిబంధన 11 ప్రకారం తాజాగా విచారణ చేపట్టాలంటూ ఈ ఏడాది మార్చి 19న హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాగంటి హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఆయన సుప్రీంలో రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా వాటిని కూడా డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు.. ప్రతివాదుల పిటిషన్లను విచారణార్హమైనవిగా భావిస్తున్నామని స్పష్టం చేసింది. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచానని ధీమా ఉంది కదా, హైకోర్టులో విచారణ జరగనివ్వండి అని కామెంట్ చేసింది.