ఎర్రకోట మాదే..ఇచ్చేయండి!

ఎర్రకోట మాదే..ఇచ్చేయండి!
  • చివరి మొఘ‌‌‌‌‌‌‌‌ల్ చ‌‌‌‌‌‌‌‌క్రవర్తి వార‌‌‌‌‌‌‌‌సురాలి దావా
  • ఎర్రకోట మాత్రమే చాలా? ఫతేపూర్ సిక్రీ, తాజ్ మహల్ కావాలా?
  •  సుల్తానా బేగం​కు సుప్రీం మొట్టికాయలు.. పిటిషన్ కొట్టివేత

న్యూఢిల్లీ: ఎర్రకోటపై దాఖ‌‌‌‌లైన దావాను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్‌‌‌‌ను తనకు అప్పగించాలంటూ మొఘ‌‌‌‌ల్ సామ్రాజ్యానికి చెందిన చివ‌‌‌‌రి చక్రవర్తి బహదూర్ షా జఫర్-II  వార‌‌‌‌సురాలిగా చెప్పుకుంటున్న సుల్తానా బేగం సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేసింది. ఎర్రకోట అప్పగింత కుదరకపోతే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అయినా ఇప్పించాలని కోరింది. ఈ పిటిషన్‌‌‌‌ను చీఫ్ జ‌‌‌‌స్టిస్ సంజీవ్ ఖ‌‌‌‌న్నా, జ‌‌‌‌స్టిస్ పీవీ సంజ‌‌‌‌య్ కుమార్‌‌‌‌తో కూడిన ధ‌‌‌‌ర్మాస‌‌‌‌నం సోమవారం విచారించింది.

 సుల్తానా బేగం వేసిన దావా పూర్తిగా త‌‌‌‌ప్పుదోవ ప‌‌‌‌ట్టించే రీతిలో ఉంద‌‌‌‌ని కామెంట్ చేసింది.  "ఎర్రకోట మాత్రమే ఎందుకు? ఫతేపూర్ సిక్రీ, తాజ్ మహల్ కూడా వద్దా? అవి మాత్రం ఎందుకు వద్దు?" అని వ్యంగ్యంగా  ప్రశ్నించింది. సుల్తానా బేగం వేసిన పిటిష‌‌‌‌న్‌‌‌‌ను తిర‌‌‌‌స్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. 

2021 నుంచి పిటిషన్లు వేస్తున్న సుల్తానా

సుల్తానా బేగం ఈ అంశంపై 2021లో తొలిసారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను రెండ‌‌‌‌వ బ‌‌‌‌హ‌‌‌‌దూర్ షా జాఫ‌‌‌‌ర్ ముని మ‌‌‌‌న‌‌‌‌వ‌‌‌‌డి భార్యనని త‌‌‌‌న పిటిష‌‌‌‌న్‌‌‌‌లో తెలిపారు. 1857లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ షా జఫర్‌‌‌‌ను బహిష్కరించి, రెడ్ ఫోర్ట్‌‌‌‌తో సహా ఆస్తులను జప్తు చేసిందని వివరించారు. భార‌‌‌‌త ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తమ పూర్వీకుల ప్రాప‌‌‌‌ర్టీని త‌‌‌‌మ‌‌‌‌కే అప్పగించాలని కోరారు. పిటిషన్ వేయడానికి164 ఏండ్లు ఎందుకు జాప్యం చేశారని జ‌‌‌‌డ్జి నిలదీశారు. పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ మళ్లీ ఆమె..2024లో డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ అప్పీల్‌‌‌‌ కూడా 900 రోజులకు పైగా ఆలస్యం కావడంతో ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో  సుల్తానా బేగం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.