
- ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. జడ్జీలకు ఎవిడెన్స్ పంపుడేంది
- కేసీఆర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- సీఎం చేసింది పూర్తిగా తప్పేనని రాష్ట్ర ప్రభుత్వ తరపు అడ్వకేట్ దవే క్షమాపణ
- బీజేపీ అండర్లో సీబీఐ ఉందని ఆరోపణ
- అట్లయితే సిట్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదా? అని ప్రశ్నించిన బెంచ్
- తదుపరి విచారణ తేదీని సీజేఐ వెల్లడిస్తారని ప్రకటన
న్యూఢిల్లీ, వెలుగు: ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక కేసుకు సంబంధించిన ఆధారాలను సుప్రీంకోర్టు జడ్జీలకు, హైకోర్టు జడ్జీలకు పంపడమేందని ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో కేసీఆర్ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా జడ్జీల ఆలోచనను మార్చడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు అడ్వకేట్ దుష్యంత్ దవే క్షమాపణలు చెప్పారు. సీఎం కేసీఆర్ చేసింది పూర్తిగా తప్పని, తన క్లయింట్ అయిన సీఎంను సంప్రదించకుండానే తాను క్షమాపణలు చెప్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ను రద్దు చేసి, సీబీఐకి దర్యాప్తును అప్పగిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వగా.. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అరవింద్ కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. బీజేపీ తరఫున సీని యర్ అడ్వకేట్ మహేశ్ జెఠ్మలానీ, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రతి రోజూ టీవీ చానళ్లలో దర్యాప్తు సంస్థల ఎంక్వైరీ ప్రసారం అవుతున్నదని దుష్యంత్ దవే అన్నారు. ఆదివారం ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్, విచారణపై కూడా ప్రసారాలు జరిగాయని తెలిపారు. దీనిపై జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ‘‘సీబీఐ పూర్తి విచారణ అంశాలను బహిర్గతం చేస్తున్నదని మీరు అంటున్నరా? సుప్రీం కోర్టు జడ్జీలు, హైకోర్టుల చీఫ్ జడ్జీలకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన పెన్ డ్రైవ్‌లు పంపడం సరైందా?’’ అని ప్రశ్నించింది. ఈ విషయంలో కేసీఆర్ చేసింది పూర్తిగా తప్పని తెలంగాణ ప్రభుత్వ తరఫు అడ్వకేట్ దుష్యంత్ దవే అన్నారు. తాను క్షమాపణలు చెప్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జస్టిస్ గవాయి స్పందిస్తూ.. ‘‘పెన్ డ్రైవ్‌లు పంపడం సుప్రీం కోర్టు జడ్జీల ఆలోచన(మైండ్) ను మార్చడం కాదా?” అని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి దవే బదులిస్తూ.. ‘‘ఔను.. నిజమే” అని ఒప్పుకున్నారు. దీన్ని మరో కోణంలో చూడాలన్నారు. స్పందించిన జస్టిస్ గవాయి.. ‘‘ఇది పూర్తి అసౌకర్యంగా ఉంది” అని పేర్కొన్నారు. ఫీల్ అయితే ఈ అంశాన్ని మరో బెంచ్‌కు బదిలీ చేయాలని దవే కోరారు.
అట్లయితే సిట్ ఎట్ల దర్యాప్తు చేస్తది..?
ఇప్పటి దాకా సిట్ జరిపిన దర్యాప్తును సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. బీజేపీ అండర్లో సీబీఐ ఉందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై జోక్యం చేసుకున్న జస్టిస్ గవాయి... ‘‘మీరు చెప్తున్న సిట్, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదా?’’ అని ప్రశ్నించారు. దీనికి దవే బదులిస్తూ.. ‘‘ఢిల్లీ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్‌కు సంబంధించిన అనేక కేసులను సీబీఐ తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొత్తం 5 గంటల వీడియో, ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్స్ ఆధారాలు ఉన్నాయి. నిందితులతో బీజేపీ పెద్దల ఫొటోలు, ఒకే లొకేషన్లో సిగ్నల్, ఫాం హౌస్ నుంచి నిందితులు ఆ పెద్దలతో చాట్ చేసిన ఎవిడెన్స్ సిట్ దగ్గర ఉన్నాయి. అప్పుడు సీబీఐ ఎట్ల ఇన్వెస్టిగేట్ చేస్తుంది?” అని అన్నారు. మరోసారి జోక్యం చేసుకున్న ధర్మాసనం.. మరి సిట్ ఎలా దర్యాప్తు చేస్తుందని ప్రశ్నించారు.
నేషనల్ పార్టీతో పోరాడుతున్నం: దవే
‘‘మాది ప్రాంతీయ పార్టీ. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిన జాతీయ పార్టీతో మేము పోరాడుతున్నం. ప్రస్తుతం దేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలపై మోపిన 35 కీలకమైన కేసులు ఉన్నాయి. అవి ఒక్క ఇంచుకూడా ముందు కదలడం లేదు. మే ము ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా నిందితులను పట్టుకున్నం. ఇప్పటి దాకా సేకరించిన కీలక ఆధారాలు అధికార పక్ష నేతలకు నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయి. అందుకే తెలం గాణ పోలీసులతో దర్యాప్తు వద్దని ప్రతివాదులు కోరుతున్నారు’’ అని దవే వాదించారు. సింగిల్ జడ్జి పర్యవేక్షణలో సిట్ వేస్తామని హైకోర్టు చెప్పిందని తెలిపారు. అయితే సిట్‌ను వేయొద్దని బీజేపీ కోరిందన్నారు. దేశంలో ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నాయని, 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని ఆరోపించారు. జస్టిస్ గవాయి స్పందిస్తూ... ‘‘ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సీఎంకు ఇచ్చారా?” అని ప్రశ్నించారు. దవే బదులిస్తూ.. ‘‘గతేడాది అక్టోబర్ 27న అన్నీ ఆధారాలను హైకోర్టుకు సమర్పించాం. ఆ రిమాండ్ అప్లికేషన్లో అన్నీ అంశాలను పొదుపరిచాం. నవంబర్ 3న హైకోర్టు బెంచ్‌కు ఎంటైర్ ఎపిసోడ్‌కు సంబంధించిన పెన్ డ్రైవ్‌ను సమర్పించాం. అదే రోజు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. అన్ని విషయాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నందున కొత్తగా ప్రెస్ మీట్ లో సీఎం చెప్పింది ఏమీ లేదు. సిట్ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుంది. దేశంలో అతి పెద్ద పార్టీ గా చెప్పుకొనే బీజేపీ.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పేందుకు కేసీఆర్ ప్రయత్నించారు” అని అన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ గవాయి... ధర్మాసనాలు మారుతున్నాయని, తదుపరి విచారణ తేదీని సీజేఐ వెల్లడిస్తారని ప్రకటించారు.