బాధితురాలి ఫొటోలు బయటకు ఎట్లొచ్చినయ్ : సుప్రీంకోర్టు

బాధితురాలి ఫొటోలు బయటకు ఎట్లొచ్చినయ్ : సుప్రీంకోర్టు
  • కోల్​కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ఫైర్
  • బెంగాల్​ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీసిన సీజేఐ బెంచ్
  • కీలక పత్రాలు లేకుండా పోస్టుమార్టం ఎట్ల చేశారు?
  • ఎఫ్​ఐఆర్​ నమోదులో జాప్యం ఎందుకు జరిగింది?
  • సోషల్ మీడియాలో బాధితురాలి ఫొటోలు తొలగించాలని ఆర్డర్​
  • ఇవ్వాల సాయంత్రంలోగా డ్యూటీలో చేరాలని డాక్టర్లకు ఆదేశం

న్యూఢిల్లీ: కోల్​కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా విచారణకు స్వీకరించింది. సోమవారం ఉదయం విచారణ ప్రారంభించిన న్యాయస్థానం.. డాక్టర్ పై అఘాయిత్యం జరిగిన తర్వాత ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కామెంట్ చేసింది. కీలకమైన పత్రాలు లేకుండానే పోస్ట్ మార్టం చేయడం, ఎఫ్ఐఆర్ నమోదులో తీవ్ర జాప్యం తదితర అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించింది. 

ఈమేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల బెంచ్ ఈ కామెంట్స్ చేసింది.అదేసమయంలో బాధితురాలి ఫొటోలు, వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంపైనా బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఫొటోలను వెంటనే సోషల్ మీడియాలో నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మమత సర్కారు తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఆర్జీ కర్ డాక్టర్ పై దారుణానికి నిరసనగా డాక్టర్లు చేపట్టిన ఆందోళనలతో రోగులు అవస్థలు పడుతున్నారని, ఇప్పటి వరకు 23 మంది రోగులు వైద్యం అందక చనిపోయారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

దీనిపై సీజేఐ బెంచ్ స్పందిస్తూ.. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా డ్యూటీలో చేరాలని ఆందోళన చేస్తున్న డాక్టర్లను ఆదేశించింది. అప్పటికీ విధుల్లో చేరని వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం బెంగాల్ సర్కారుకు ఉంటుందని స్పష్టం చేసింది. అదే సమయంలో డాక్టర్ల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని, ఆస్పత్రుల్లో వారి సేఫ్టీ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని మమత సర్కారుకు సుప్రీంకోర్టు సూచించింది. తాజా స్టేటస్ రిపోర్టును అందజేయాలంటూ సీబీఐని ఆదేశిస్తూ..  సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ బెంచ్​ ఈ కేసు 
విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

పోస్ట్ మార్టం సమయంలో నిర్లక్ష్యం.. 

కేసు విచారణలో భాగంగా పోస్ట్ మార్టం జరగడానికి ముందు మృతురాలి ఒంటిపై దుస్తులు ఉన్నాయా, మృతదేహాన్ని ఏ స్థితిలో గుర్తించారని బెంగాల్ ప్రభుత్వాన్ని సీజేఐ బెంచ్ ప్రశ్నించింది. పోస్ట్ మార్టం చేయడానికి అవసరమైన పత్రాలు కనిపించడంలేదన్న బెంగాల్ ప్రభుత్వ సమాధానంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కీలకమైన ఈ పత్రాలు కనిపించకుండా పోవడంపైనా విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది. 

కేసు దర్యాప్తునకు సంబంధించి సీబీఐ సమర్పించిన స్టేటస్‌ రిపోర్ట్‌ను, బెంగాల్‌ ప్రభుత్వం అందించిన రిపోర్టును సీజేఐ బెంచ్ పరిశీలించింది. అత్యాచార ఘటన జరిగిన సమయం, వివరాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ సీబీఐకి ఇచ్చారా? లేదా? అని ఈ సందర్భంగా బెంచ్​ప్రశ్నించింది. ‘శాంపిల్స్ ఎవరు సేకరించారు’ అనేది ఈ కేసులో కీలకమని, ఈ విషయం నిర్ధారణ అయిన తర్వాత వచ్చే మంగళవారం తాజా రిపోర్ట్ దాఖలు చేయాలని సూచించింది.

Also Read :- సుప్రీంకోర్టు తీర్పు ఓ వార్నింగ్​లా ఉండాలి

మృతురాలి బాడీపై గాయాలు

ఘటన జరిగిన తర్వాత బాధితురాలి శరీరంపై గాయాలున్నాయని సొలిసిటర్​జనరల్​తుషార్​మెహతా కోర్టుకు తెలిపారు. మృతదేహాన్ని ఉదయం 9.30 గంటలకు గుర్తించినట్టు చెప్పారు. తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ నమూనాలను ఎయిమ్స్‌కు పంపాలని సీబీఐ నిర్ణయించిందని చెప్పారు. కాగా, దర్యాప్తులో భాగంగా తాము సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని సీబీఐ పేర్కొన్నది. ఇదిలా ఉండగా, సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని  కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో సీఐఎస్‌ఎఫ్‌లోని మూడు కంపెనీలకు వసతి కల్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ హోం శాఖ సీనియర్ అధికారి, సీనియర్ 
సీఐఎస్‌ఎఫ్ అధికారిని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇవ్వాల 5 గంటల్లోగా డ్యూటీలో చేరాలని డాక్టర్లకు వార్నింగ్​

డాక్టర్​పై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా వైద్యులు విధులకు హాజరుకాకపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారని బెంగాల్‌ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధులకు హాజరుకావాలని వైద్యులను కోర్టు ఆదేశించింది. నిరసనకు దిగిన డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర సర్కారుకు సూచించింది. 

అయితే, గడువు తర్వాత కూడా విధుల్లో చేరని డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకునే అధికారం బెంగాల్ సర్కార్ కు ఉందని సీజేఐ బెంచ్ స్పష్టం చేసింది. అలాగే,  బాధితురాలికి సంబంధించిన ఫొటోలు, దృశ్యాలు అన్నీ సోషల్​ మీడియా వేదికల నుంచి వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఎఫ్ఐఆర్​నమోదు చేయడంలో పోలీసులు ఆలస్యం చేసిన ఘటనపైకూడా విచారణ జరపాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.