
న్యూఢిల్లీ: ఆర్మీ ఆఫీసర్ కర్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద కామెంట్లు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. సోఫియా ఖురేషికి విజయ్ షా క్షమాపణ సరిగ్గా లేదని.. ఆయన చెప్పిన క్షమాపణను అంగీకరించట్లేదని స్పష్టం చేసింది. పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలని మంత్రిని హెచ్చరించింది. ఆయన వ్యాఖ్యలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తో విచారణ జరపాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రస్తుతానికి ఆయన అరెస్టుపై స్టే విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఇటీవల సోఫియా ఖురేషిని విజయ్ షా 'టెర్రరిస్టుల సోదరి'గా పేర్కొంటూ వివాదాస్పద కామెంట్ చేయడంతో దుమారం రేగింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు.. ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. వెంటనే కర్నల్ సోఫియాకు క్షమాపణ చెప్పాలని సుప్రీం ఆయనను ఆదేశించింది.
దీంతో విజయ్ షా స్పందిస్తూ.."సోఫియా ఖురేషి భారతదేశానికి కీర్తిని తెచ్చారు. ఆమెను అవమానించాలని కలలో కూడా అనుకోవట్లేదు. అయినప్పటికీ, నా మాటలు సమాజాన్ని లేదా ఏదైనా మతాన్ని బాధించినట్లయితే, నేను పదిసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను" అని పేర్కొన్నారు.
మనస్ఫూర్తిగా సారీ చెప్పలేరా..?
కున్వర్ విజయ్ షా నిర్లక్ష్యపు క్షమాపణపై సుప్రీం కోర్టు సోమవారం ఫైర్ అయింది. సారీ చెబుతున్నప్పుడు అందులో కొంతైనా అర్థం, పశ్చాత్తాపం ఉండాలి. న్యాయస్థానం అడిగింది కాబట్టి చెబుతున్నా అన్నట్లుగా మీ వ్యవహారం ఉంది. మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడానికి మీకున్న అభ్యంతరం ఏంటి..?" అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.