హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో నిర్మిస్తున్న పల్సస్ఐటీ పార్క్ ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్యాంపస్‌కు ఐటీ ఆధారిత సేవలు (ఐటీఈఎస్) ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్) హోదాను న్యాయస్థానం సమర్థించింది. దీంతో పల్సస్ గ్రూప్ ఈ ఏఐ హెల్త్‌కేర్ డిజిటల్ ఇన్నోవేషన్ హబ్‌లో రూ. 500 కోట్లు పెట్టుబడులతో విస్తరణ పనులను వేగవంతం చేసింది.
35 ఎకరాల ఈ క్యాంపస్ ద్వారా 6,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 30 వేల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పల్సస్ సంస్థ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు ప్రకటించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఏఐ నిపుణులు, హెల్త్‌కేర్ డేటా సైంటిస్టుల నియామకాలకు ఈ కేంద్రం వేదిక కానుంది.
లీగల్ అడ్డంకులు తొలగిపోవడంతో మియాపూర్ గ్రోత్ కారిడార్ పరిసర ప్రాంతాలలో సాంకేతిక వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఉద్యోగాల కల్పనతో పాటు ఆవిష్కరణలు, పరిశోధనలు, అంతర్జాతీయ సేవల రంగాన్ని ప్రోత్సహించే ఒక బలమైన వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వర్సిటీలు, పరిశోధనా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, స్టార్టప్‌లు, టెక్ కంపెనీలతో కలిసి పనిచేస్తామని పల్సస్ తెలిపింది.
