ఢిల్లీ లిక్కర్ స్కాంలో..అభిషేక్ మధ్యంతర బెయిల్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో..అభిషేక్ మధ్యంతర బెయిల్ పొడిగింపు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత సన్నిహితుడు బోయినపల్లి అభిషేక్ మధ్యంతర బెయిల్​ను సుప్రీంకోర్టు మే 8వ తేదీ వరకు పొడిగించింది. తన భార్య అనారోగ్యం దృష్ట్యా.. బెయిల్ మంజూరు చేయాలని గతేడాది జులైలో అభిషేక్ దాఖలు చేసిన పిటిషన్​ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ అభిషేక్ బోయినపల్లి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్( ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ ను మార్చి 20న విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిషేక్ బోయినపల్లికి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. అయితే గతంలో ఇచ్చిన బెయిల్ టైం ముగియడంతో... మరోసారి అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

అభిషేక్ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు కొనసాగిస్తూ.. పిటిషనర్ మధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరారు. ఈ విజ్ఞప్తి పై ఈడీ అభ్యంతరం తెలపకపోవడంతో.. అభిషేక్ మధ్యంతర బెయిల్​ను మే 8వ తేదీ వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో మెన్షన్ చేసిన.. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని, నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్న నిబంధనలు యథావిధిగా ఉంటాయని స్పష్టం చేసింది.