దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోకులంటారా?.. క్షమాపణలు చెప్పండి

దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోకులంటారా?.. క్షమాపణలు చెప్పండి
  • వెంటనే మీ ఛానల్స్ ద్వారా వారికి క్షమాపణ చెప్పండి
  • సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై సుప్రీంకోర్టు ఫైర్ 

న్యూఢిల్లీ: దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోక్స్ వేస్తున్న ఐదుగురు స్టాండప్ కమెడియన్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తమ యూట్యూబ్ ఛానెల్‌లు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఇన్‌ఫ్లుయెన్సర్లు సమయ్ రైనా, విపుల్ గోయల్, బలరాజ్ పరమ్‌జీత్ సింగ్ ఘాయ్, సోనాలీ థక్కర్, నిశాంత్ జగదీశ్ తన్వర్ లను ఆదేశించింది. స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులను గేలి చేయడమేంటని ఫైర్ అయింది. 

హాస్యం ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదని మందలించింది. దివ్యాంగులను అవమానించేలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జోకులు వేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(ఎస్ఎంఏ) రోగులకు మద్దతిచ్చే ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా  సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియాపై దాఖలైన వాటితో కలిపి ఈ పిటిషన్ ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన బెంచ్ సోమవారం విచారించింది. 

ఈ సందర్భంగా సమయ్ రైనా దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ను సుప్రీం తప్పుబట్టింది. రైనా తనను తాను అమాయకుడిగా చిత్రీకరించుకొని తర్వాత క్షమాపణలు చెప్పారని మండిపడింది. దివ్యాంగులను అవమానించిన ఐదుగురూ కచ్చితంగా తమ చానెల్స్ ద్వారా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. భవిష్యత్తు సవాళ్లను దృష్టిలోఉంచుకొని ఇలా దివ్యాంగులను ఎగతాళి చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ రూపొందించాలని సూచించింది. 

ఈరోజు దివ్యాంగులు, తర్వాత మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇలా ఎగతాళి చేస్తూ పోతే ఇదంతా ఎక్కడ ఆగుతుందని అసహనం వ్యక్తంచేసింది. ఇలాంటివారిపై ఫైన్ విధించే అంశాన్ని తదుపరి విచారణలో పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.