ముస్లిం మహిళలకు  పూర్తి న్యాయం ఎప్పుడు.?

ముస్లిం మహిళలకు  పూర్తి న్యాయం ఎప్పుడు.?

ఇన్​స్టంట్ త్రిపుల్ తలాఖ్  రద్దుతో ముస్లిం మహిళలకు కొంత న్యాయం జరిగినా, షరియత్​ రక్షణ కల్పిస్తున్న కొన్ని రుగ్మతలు వారిని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వాటి నుంచి కూడా విముక్తి కల్పించాలంటూ ముస్లిం మహిళలు సుప్రీం తలుపు తట్టారు. ముస్లిం పర్సనల్ లా(షరియత్) చట్టం–1937లోని వివాహ, విడాకుల సంబంధిత రుగ్మతలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల బెంచ్​విచారణ ప్రారంభించింది. అసలేంటి ఈ షరియత్ చట్టం? 

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత పార్లమెంట్ హిందువుల ఆచారాలను, కట్టుబాట్లను, పద్ధతులను హిందూ కోడ్ బిల్ రూపంలో క్రోడీకరిస్తూ .. వివాహం, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తతలను 4 చట్టాల పరిధిలోకి తీసుకువచ్చింది. ఇదే బిల్లు సిక్కులకు, బౌద్ధులకు, జైనులకు కూడా వర్తింపజేసింది. కానీ ముస్లింల విషయంలో బ్రిటీష్ ప్రభుత్వం ‘డివైడ్ అండ్ రూల్’ విధానం కింద తీసుకువచ్చిన షరియత్ చట్టం–1937 అమలునే స్వాతంత్ర్యనంతరం కూడా కొనసాగించింది. ఈ చట్టం అమలను ఒక ప్రభుత్వేతర సంస్థ అయిన ముస్లిం ఉలేమాలతో కూడిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్​బీ) సంస్థకు అప్పజెప్పింది. కాగా ఈ షరియత్ చట్టం ముస్లిం పురుషులకు ముస్లిం మహిళల మీద 5 అంశాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. 

బహుభార్యత్వం(పాలిగామి): ఒక ముస్లిం పురుషుడు తన ఇతర భార్యలకు విడాకులు ఇవ్వకుండానే నలుగురు స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. అదే ముస్లిం మహిళలు మాత్రం తమ భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాతనే ఇతర పురుషులను వివాహం చేసుకోవాలి. అలాగే ఐపీసీ సెక్షన్ 494 ప్రకారం హిందువులు లేదా ఇతర మైనారిటీ వర్గాల పురుషులు బహు భార్యత్వానికి పాల్పడితే వాళ్లకు 7 ఏండ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది. కానీ ఈ సెక్షన్ ముస్లిం పురుషులకు వర్తించదు.తలాఖ్ విధానం ద్వారా విడాకులు: ఒక ముస్లిం పురుషుడు సివిల్ కోర్టుకు వెళ్లే అవసరం లేకుండా తలాఖ్- ఈ హసన్ విధానం ద్వారా నెలకు ఒక తలాఖ్ ఇచ్చి మూడు నెలల్లోగా భార్యకు విడాకులు ఇవ్వొచ్చు. అలాగే ముస్లిం మహిళలు ‘ఖులా’ విధానం ద్వారా తమ భర్తలకు విడాకులు ఇవ్వొచ్చు. ఇందుకు ఏఐఎంపీఎల్ బీ ఏర్పాటు చేసిన షరియా కోర్టుల ద్వారా ముస్లింలు విడాకుల పత్రాన్ని పొందొచ్చు. కొంతమంది ముస్లిం పురుషులు మెసేజీలు, ఇంకా వాట్సాప్ ద్వారా కూడా ఒకేసారి3 సార్లు తలాఖ్ (తలాఖ్ -ఇ -బిద్దత్) ఇచ్చేసి భార్యకు విడాకులు ఇవ్వడంతో 2017లో సుప్రీంకోర్టు ‘ఇన్​స్టంట్ త్రిపుల్ తలాఖ్’ను రద్దు చేసింది.చాలా మంది ముస్లిం మహిళలు తలాఖ్-ఈ -హసన్ ను కూడా రద్దు చేసి, హిందూ మహిళలతో సమానంగా కోర్టు ద్వారా విడాకులు తీసుకునే హక్కు కల్పించాలంటున్నారు. నిఖా హలాలా: నిఖా హలాలా పద్ధతి కింద ఒకసారి విడాకులు ఇచ్చిన తన భర్తను తిరిగి వివాహం చేసుకోవాలంటే సదరు ముస్లిం మహిళ మరొకరిని పెండ్లి చేసుకొని, అతని దగ్గర తలాఖ్ తీసుకుని తిరిగి తన మొదటి భర్తతో నిఖా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతి తమను ముస్లిం పురుషులకు ఒక ఆట బొమ్మను చేసిందంటూ దీన్ని తక్షణమే రద్దు చేయాల్సిందిగా ముస్లిం మహిళలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఉమ్మడి పౌర స్మృతి

ముస్లిం పురుషులకు సంక్రమించిన బహు భార్యత్వం హక్కు ముస్లిం మహిళలను వివక్షకు గురి చేయడమే కాకుండా అన్య మతస్తుల్లో ముఖ్యంగా హిందువుల్లో అనారోగ్యకర మత మార్పిడీలకు కూడా దోహదం చేసింది. ఇస్లాం మతంలోకి మారితే తమ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో భార్యను వివాహం చేసుకోవచ్చనే అపోహతో చాలా మంది హిందూ యువకులు ఇస్లాం మతంలోకి మారారు. దీనిపై1995లో సుప్రీం కోర్టు ‘సరళా ముడ్గల్’ కేసులో అలాంటి మత మర్పిడీలు, వివాహాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. 2009 లో లా కమిషన్ కూడా తమ “ప్రివెంటింగ్ బైగమి వయా కన్వర్షన్ టు ఇస్లాం” అనే నివేదికలో సరళా ముడ్గల్ కేసులో సుప్రీం తీర్పుకు చట్ట బద్ధత కల్పించాలని ప్రభుత్వానికి సూచించింది. 2018లో మోడీ ప్రభుత్వం ‘ఉమ్మడి పౌర స్మృతి’ తీసుకురావడానికి గల సాధ్యాసాధ్యాలను సూచించాలని లా కమిషన్ ను అడిగింది. ముస్లింలకు కూడా ఐపీసీ సెక్షన్ 494 ను అమలు చేయాలని లా కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయంలో బహు భార్యత్వాన్ని రద్దు చేసి పాకిస్థాన్​మనకంటే ఎంతో ముందుందని నివేదికలో పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 దేశంలోని పౌరులందరికీ మతంతో సంబంధం లేకుండా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నా,  ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడిన పార్టీలు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఫలితంగా ముస్లిం మహిళలు బలైపోతున్నారు. సుప్రీం కోర్టయినా వాళ్ల ఆశలను నేరవేరుస్తుందా వేచి చూడాలి. 

అసమానమైన ఆస్తి వారసత్వ హక్కులు: 

హిందూ కోడ్ బిల్లు ద్వారా హిందూ మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కులు సంక్రమిస్తే, ముస్లిం మహిళలకు మాత్రం వారి తల్లిదండ్రుల ఆస్తుల్లో తమ సోదరులకు ఎంత భాగమైతే వస్తుందో అందులో సగ భాగం మాత్రమే హక్కుగా సంక్రమిస్తుంది. భర్త చనిపోతే, ఒకవేళ తమకు పిల్లలు ఉంటే, భర్త ఆస్తిలో 1/8 భాగం, పిల్లలు లేకుంటే 1/4 భాగం హక్కుగా సంక్రమిస్తుంది. పై వాటిల్లో ప్రధానంగా బహు భార్యత్వాన్ని, నిఖా హలాలాను తక్షణమే రద్దు చేయాలంటూ పిటిషనర్లు సుప్రీం కోర్టును కోరుతున్నారు. 
- డి. రాఘవేందర్ రావు,
పాలసీ ఎనలిస్ట్