బ్యాలెట్ పేపర్లపై ఆ గుర్తు ఎందుకు వేశారు?: సుప్రీంకోర్టు

బ్యాలెట్ పేపర్లపై ఆ గుర్తు ఎందుకు వేశారు?: సుప్రీంకోర్టు
  • రిటర్నింగ్​ ఆఫీసర్​ను ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి
  • చండీగఢ్​ మేయర్ ఎన్నికల వివాదంపై సుప్రీంలో విచారణ
  • ఆర్వో, బీజేపీ నేత అనిల్​మసీహ్​ను స్వయంగా విచారించిన సీజేఐ
  • స్వతంత్ర భారత దేశంలో ఇదే తొలిసారి అంటున్న నిపుణులు

న్యూఢిల్లీ: చండీగఢ్ ​మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను సుప్రీంకోర్టు సీరియస్​గా తీసుకుంది. బ్యాలెట్ పేపర్లపై ఇంటూ మార్క్ వేస్తూ, అవి చెల్లవని రిటర్నింగ్​ ఆఫీసర్ పక్కన పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. రిటర్నింగ్ ఆఫీసర్​గా వ్యవహరించిన బీజేపీ నేత అనిల్​మసీహ్​ను విచారణకు పిలిచింది.

చండీగఢ్ ​మేయర్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ విచారణలో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సోమవారం కోర్టుకు హాజరైన అనిల్​ మసీహ్​ను స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్​ విచారించారు. కాగా, ఎన్నికల్లో అవకతవకల నేపథ్యంలో మరో నేతను రిటర్నింగ్​ అధికారిగా ఎన్నుకుని, బ్యాలెట్ పేపర్లను మళ్లీ లెక్కించాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్​ పంజాబ్​ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోసారి పోలింగ్​ నిర్వహించాలన్న ఆప్ డిమాండ్​ను తోసిపుచ్చారు.

మేయర్ ఎన్నికలో ఏంజరిగింది..

గత నెల 30న జరిగిన చండీగఢ్​ మేయర్ ఎన్నికల్లో బీజేపీ నేత మనోజ్ సోంకార్ గెలిచినట్లు ఆర్వో అనిల్​ మసీహ్ ​ప్రకటించారు. మొత్తం పోల్ అయిన ఓట్లలో 8 ఓట్లు చెల్లవంటూ పక్కన పెట్టారు. అయితే, బీజేపీకి తగినంత బలంలేకున్నా సోంకార్​ను గెలిపించేందుకు ఈ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా గందరగోళం నెలకొంది.

ఆ సమయంలో బ్యాలెట్ పేపర్లపై ఆర్వో పెన్నుతో రాయడం అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డైంది. తర్వాత ఈ వీడియో బయటకు రాగా.. బ్యాలెట్ పేపర్లపై అనిల్​ మసీహ్​ ఇంటూ మార్కు పెట్టడం స్పష్టంగా కనిపించింది. దీనిపై ఆప్ సుప్రీంను ఆశ్రయించింది.

సీజేఐ, బీజేపీ నేత మధ్య జరిగిన సంభాషణ..

సీజేఐ: మిస్టర్ మసీహ్.. ఇది చాలా సీరియస్ విషయం. మేమడిగే ప్రశ్నలకు నిజాయితీగా జవాబివ్వండి. సీసీ కెమెరా వైపు చూస్తూ బ్యాలెట్ పేపర్లపై మీరు ఇంటూ మార్కు పెడుతున్న వీడియోను మేమంతా చూశాం. బ్యాలెట్ పేపర్లపై ఇంటూ మార్కు ఎందుకు పెట్టారు?

మసీహ్: ఓటింగ్​పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్ల పరిశీలనలో భాగంగా మార్క్ చేశాను. చెల్లని ఓట్లను వేరు చేయడానికే అలా చేశా.

సీజేఐ: ప్రత్యేకంగా కొన్ని పేపర్లను ఎంచుకుని మరీ మార్క్ చేయడం వీడియోలో కనిపించింది. కేవలం కొన్నింటిపైనే ఇంటూ మార్కు పెట్టారా?

మసీహ్: అవును

సీజేఐ: ఎన్ని పేపర్లపై అలా మార్క్ చేశారు?

మసీహ్: 8

సీజేఐ: బ్యాలెట్ పేపర్లపై ఇంటూ మార్క్ వేయాలని నిబంధనల్లో లేదు కదా. సంతకం చేస్తే సరిపోయేది, మరి ఎందుకలా చేశారు?

మసీహ్: కొంతమంది అభ్యర్థులు బ్యాలెట్ పేపర్లను లాక్కుని చించేశారు. ఆ ప్రయత్నంలో మార్క్ చేశాను.

సీజేఐ: మిస్టర్ సొలిసిటర్, మీరు ఇతడిని ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఎన్నికల ప్రాసెస్​లో ఈయన జోక్యం చేసుకుంటున్నాడు.