
- స్వచ్ఛందంగా బెట్టింగ్‌లో పాల్గొనకుండా ఆపలేం: సుప్రీం
- కేఏ పాల్ పిటిషన్‌పై విచారణ.. కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ, వెలుగు: బెట్టింగ్.. సమాజ వికృత చర్య అని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. చట్టాన్ని అమలు చేసినంత మాత్రానా స్వచ్ఛందంగా బెట్టింగ్ లో పాల్గొనకుండా ఆపలేమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌లు రద్దు చేయాలని, వీటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మార్చి 26న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చారు.
పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టుకు ప్రత్యక్షంగా హాజరైన కేఏ పాల్.. వ్యక్తిగతంగా కేసు వాదించారు. ‘‘బెట్టింగ్ యాప్ ల కారణంగా ఎంతో మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇన్ ఫ్లుయెన్సర్లు, నటులు, క్రికెటర్లు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ను ప్రోత్సహిస్తున్నారు. వాటికి ఎంతో మంది అట్రాక్ట్ అవుతున్నారు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలపై చర్యలు తీసుకోవాలి.
బెట్టింగ్ యాప్ ఉచ్చులో చిక్కుకుని అప్పులపాలై ఒక్క తెలంగాణలోనే వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్నరు. గత రెండేండ్లలో పిల్లల్ని కోల్పోయిన పేరెంట్స్ తరఫున నేను కోర్టును ఆశ్రయించాను. యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. స్మోకింగ్ కంటే మిలియన్ టైమ్స్ బెట్టింగ్ యాప్‌లు డేంజర్. మనీలాండరింగ్‌కు అడ్డుకట్ట వేయాలంటే బెట్టింగ్ యాప్‌లను నిషేధించేలా కేంద్రం చట్టం తేవాలి’’అని కేఏ పాల్ వాదించారు.
జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. ‘‘చట్టం చేసినంత మాత్రానా స్వచ్ఛందంగా బెట్టింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకోలేం. ఈ అంశంలో మేము మీతో ఉన్నాం. చట్టంతో బెట్టింగ్ ను కంట్రోల్ చేయొచ్చనే అపోహలో మీరు ఉన్నారు. చట్టాలతో ప్రజల ఆత్మహత్యలు ఆపనట్లే.. బెట్టింగ్ లో పాల్గొనకుండా చట్టం కూడా నిరోధించలేకపోవచ్చు’’అని ఆయన అన్నారు. ఈ మేరకు ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ల నియంత్రణలో అభిప్రాయం తెలపాలని ఆదేశించింది.