
న్యూఢిల్లీ: కోర్టులు రికవరీ ఏజెంట్లుగా పనిచేయవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా మార్చే ధోరణి పెరుగుతున్నదని అసహనం వ్యక్తం చేసింది. మంగళవారం యూపీకి చెందిన ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్సూర్యకాంత్, జస్టిస్ఎన్.కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ద్విసభ్యధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. డబ్బు వసూలు వివాదంలో ఓ వ్యక్తిపై కిడ్నాపింగ్ ఆరోపణలు చేస్తూ నమోదైన కేసుపై విచారణ చేపట్టింది. ఆ వివాదంలో కిడ్నాప్‌అభియోగాలు మోపడంపై ఆందోళన వ్యక్తంచేసింది.
బకాయి డబ్బుల రికవరీ లాంటి సివిల్ వివాదంలో అరెస్ట్‌ను ఓ బెదిరింపుగా ఉపయోగించలేమని పేర్కొన్నది. సివిల్వివాదం అయినా డబ్బు రికవరీ కోసం క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని, ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరుగుతోందని మండిపడింది. ‘‘బకాయిల మొత్తాన్ని వసూలుచేయడానికి కోర్టులేమీ రికవరీ ఏజెంట్లు కావు. న్యాయవ్యవస్థ దుర్వినియోగాన్ని అనుమతించబోం’’ అని వ్యాఖ్యానించింది.
ఈ కేసుల్లో పోలీసులది క్లిష్ట పరిస్థితి: ఏఎస్జీ
యూపీ ప్రభుత్వం తరఫున అడిషనల్సొలిసిటర్జనరల్కేఎం నటరాజ్‌వాదనలు వినిపించారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు ఇరకాటంలో పడుతున్నారని, కాగ్నిజబుల్ నేరం జరిగినట్లు ఆరోపణలు ఉండి కేసు నమోదు చేయకపోతే పోలీసులను కోర్టు తప్పుపడుతుందని, కేసు నమోదు చేస్తే పక్షపాతంగా వ్యవహరించాయని ఆరోపణలు వస్తాయని అన్నారు.
జస్టిస్సూర్యకాంత్స్పందిస్తూ.. కొన్ని సందర్భాల్లో గందరగోళం ఉంటుందని, సివిల్ వివాదాల్లో వేధింపుల సాధనంగా క్రిమినల్ చట్టాలను ఉపయోగించకుండా నిరోధించేందుకు తెలివిగా వ్యవహరించాలని సూచించారు. అరెస్టు చేసే ముందే అది క్రిమినల్ కేసా..? లేదా సివిల్ వివాదమా..? అనేది క్షుణ్నంగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఇలాంటి కేసులు జస్టిస్ డెలివరీ సిస్టమ్‌కే తీవ్ర ముప్పు అని తెలిపారు.