
న్యూఢిల్లీ: అమ్మాయిలు సెక్సువల్ కోరికలను కంట్రోల్లో ఉంచుకోవాలని, రెండు నిమిషాల ఆనందం కోసం తప్పు చేయొద్దని కలకత్తా హైకోర్టు చేసిన సూచనలపై సుప్రీం కోర్టు ఫైర్ అయింది. కోర్టు కేసుల్లో జడ్జిలు తమ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుడేందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు బెంగాల్ సర్కారుకు, ఇతర పార్టీలకు సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసులు ఇచ్చింది. ఓ బాలికపై రేప్ కేసులో టీనేజర్ అభ్యర్థనపై విచారణ సందర్భంగా కలకత్తా కోర్టు పలు సూచనలు చేసింది.
అమ్మాయిలు కౌమార దశలో లైంగిక కోరికలు కంట్రోల్ చేసుకోవాలి. 2 నిమిషాల సంతోషం కోసం లొంగిపోతే సమాజం దృష్టిలో ఆమె ఓడిపోతుందని పేర్కొంది. ‘‘ఆమె శరీరాన్ని, హుందాతనాన్ని, విలువను కాపాడుకునే హక్కు అమ్మాయిలకే ఉంది. అబ్బాయిలు కూడా అమ్మాయిల గౌరవాన్ని కాపాడాలి. మహిళలను గౌరవించేలా వారి మనసులను తీర్చిదిద్దాలి.
చిన్న వయసులోనే లైంగిక సంబంధాల వల్ల తలెత్తే సమస్యలపై స్కూళ్లలో సెక్సువల్ ఎడ్యుకేషన్ అందించాలి”అని కలకత్తా హైకోర్టు సూచనలు చేసింది. ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తప్పుపట్టింది. హైకోర్టు సూచనలు పూర్తిగా అభ్యంతరకరమైనవని, ఇలాంటివి అనవరమని పేర్కొంది.