పోక్సో కేసులో...బీఆర్ఎస్ కౌన్సిలర్‌‌కు సుప్రీం నోటీసులు

పోక్సో కేసులో...బీఆర్ఎస్ కౌన్సిలర్‌‌కు సుప్రీం నోటీసులు
  • బాలుడి కంప్లైంట్​తో ఆలస్యంగా వెలుగులోకి లైంగిక దాడి ఘటన
  • నిందితుడి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంలో బాధితుడి పిటిషన్
  • జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌‌లో ఘటన 

న్యూఢిల్లీ, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మునిసిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అసీఫుద్దీన్ ఖాన్ కు పోక్సో కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2024, నవంబర్ లో తనపై అసీఫుద్దీన్ ఖాన్ లైంగిక దాడి, వేధింపులకు పాల్పడ్డాడని ఓ బాలుడు ఈ ఏడాది మార్చి 28 న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన రోజు నాటికి బాలుడు మైనర్ కావడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

దీనిపై నిందితుడు ముందస్తు బెయిల్ కోరుతూ.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బాలుడు తనపై తప్పుడు కేసు పెట్టాడని, ఘటన జరిగినట్లు ఆరోపిస్తోన్న తేదీ తర్వాత 17 నెలలకు నమోదు చేశారని కోర్టుకు తెలిపాడు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొన్న హైకోర్టు అసిఫ్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఏప్రిల్ 21న బాధిత బాలుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌‌తో కూడిన బెంచ్ విచారించింది. కోర్టు రాతపూర్వక సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, నిందితుడికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 22వ తేదీకి వాయిదా వేసింది.