V6 News

పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ పెట్టండి

పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ పెట్టండి
  • సుప్రీంలో బీజేపీ నేత అశ్వినికుమార్  పిటిషన్
  • అభిప్రాయం చెప్పాలని కేంద్రం ప్రభుత్వం, ఎలక్షన్  కమిషన్​కు సుప్రీం నోటీసులు 
  • ఈ అంశంపై పరిశీలిస్తామని బెంచ్  వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: పోలింగ్  కేంద్రాల్లో దొంగ ఓట్లకు ఆస్కారం లేకుండా బయోమెట్రిక్  విధానాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ నేత, అడ్వొకేట్  అశ్విని కుమార్  ఉపాధ్యాయ్.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాం (పిల్‌‌) దాఖలు చేశారు. ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా పోలింగ్  కేంద్రాల్లో వేలిముద్రలు, ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్  గుర్తింపును అమలు చేయాలని, ఈ బయోమెట్రిక్  విధానంతో ఎన్నికల్లో ప్రాక్సీ ఓటింగ్, నకిలీ ఓటింగ్, ఓటర్లను ప్రలోభపెట్టడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని పిల్ లో ఆయన ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఆయన పిల్  వేశారు. ఈ వ్యాజ్యంపై సీజేఐ జస్టిస్  సూర్యకాంత్  నేతృత్వంలోని జస్టిస్  జోయ్ మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

పిటిషనర్‌‌  ఉపాధ్యాయ్‌‌  వాదనలు వినిపిస్తూ..  ఈ విషయమై గత నెల 28న ఎన్నికల కమిషనర్లకు వినతిపత్రం సమర్పించినా స్పందన లేకపోవడంతో, న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపారు. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని, దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఇప్పటికిపుడు దీని అమలు సాధ్యం కాకపోయినా.. ప్రాక్సీ ఓటింగ్‌‌ (ఒకరి బదులు మరొకరు ఓటు వేయడం), ఓటర్లను ప్రలోభపెట్టడం వంటి అక్రమాలను అరికట్టడానికి భవిష్యత్తులో దీనిని ప్రవేశపెట్టవచ్చని అభ్యర్థించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్‌‌ 23(4) ప్రకారం ఇప్పటికే ఆధార్‌‌ను గుర్తింపు కార్డుగా అనుమతిస్తున్నారని, అదే తరహాలో పోలింగ్‌‌ బూత్‌‌లలోనూ బయోమెట్రిక్‌‌ ధ్రువీకరణను అమలు చేయాలని కోరారు. రాజ్యాంగంలోని అధికరణ 324 కింద ఎన్నికల సంఘానికి ఉన్న సంపూర్ణ అధికారాలను ఉపయోగించి ఈ మార్పులు చేయవచ్చని పిటిషనర్ సూచించారు.

ఆచరాణాత్మక అంశాలు పరిశీలించాలి

పోలింగ్‌‌  కేంద్రాల్లో వేలిముద్రలు, ఐరిస్‌‌  వంటి బయోమెట్రిక్‌‌  విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన ఎన్నికల నిబంధనల్లో పెను మార్పులకు దారితీస్తుందని బెంచ్  వ్యాఖ్యానించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ కోసం ఈసీకి పూర్తి అధికారాలు ఉన్నాయని గుర్తుచేసింది. అయితే, ఇది ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారాన్ని మోపుతుందని, అయిన్పటికీ ఆచరణాత్మక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. కొన్ని రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ఈ విధానాన్ని పరిశీలించలేమని స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ అభిప్రాయాలు తెలిపాలని కేంద్ర  ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.