దిశ కేసులో సుప్రీం జ్యుడీషియల్ ఎంక్వైరీ స్టార్ట్

దిశ కేసులో సుప్రీం జ్యుడీషియల్ ఎంక్వైరీ స్టార్ట్

దిశ కేసులో సుప్రీం జ్యుడీషియల్ ఎంక్వైరీ మొదలైంది. ముగ్గురు సభ్యుల కమిషన్ హైదరాబాద్ లో నిన్న మొదటిరోజు దర్యాప్తు పూర్తిచేసింది. మూడు రోజుల దర్యాప్తులో చటాన్ పల్లి ఎన్ కౌంటర్ పై ఆరా తీయనుంది. సిట్ నివేదిక, పోస్టుమార్టమ్ రిపోర్టులను కమిషన్ పరిశీలించింది. ఇవాళ చటాన్ పల్లి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించనుంది జ్యూడీషియల్ కమిషన్.

కమిటీ సభ్యులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సిర్పూర్కర్, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాశ్ హైదరాబాద్ వచ్చారు. హైకోర్టు సి బ్లాక్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక చాంబర్లను పరిశీలించారు. చటాన్ పల్లి ఎన్ కౌంటర్ జరిగిన తీరుపై హైకోర్టు వేదికగా దర్యాప్తు ప్రారంభించింది కమిషన్.

నలుగురు నిందితుల డెడ్ బాడీలకు గాంధీ డాక్టర్లు చేసిన పోస్టుమార్టమ్ రిపోర్టు… హైకోర్టు ఆదేశాలతో ఢిల్లీ ఎయిమ్స్ బృందం చేసిన రీ పోస్టుమార్టం రిపోర్టులను సీల్డ్ కవర్ లో జ్యుడీషియల్ కమిషన్ కు అందించారు అధికారులు.  హైకోర్టు రిజిస్ట్రార్… ఈ రిపోర్టులను కమిషన్ కు హ్యాండోవర్ చేశారు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తో వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి జ్యుడీషియల్ కమిషన్ వివరాలు సేకరించింది. ఎన్ కౌంటర్ పై సిట్ రిపోర్టును కమిషన్ సభ్యులకు అందించారు మహేశ్ భగవత్. ఎన్ కౌంటర్ లో పోలీసులు వాడిన వాహనాలు, ఆయుధాలు, బుల్లెట్లను ఇప్పటికే సిట్ అధికారులు సీజ్ చేశారు. వీటితోపాటు.. సాక్షులకు సంబంధించిన వివరాలను కమిషన్ కు అప్పగించారు.

హైదరాబాద్ కు వచ్చిన కమిషన్ సభ్యులకు సీఆర్పీఎఫ్ బలగాలతో సెక్యూరిటీ అందిస్తున్నారు. విచారణకు ఎలాంటి ఆటంకం కలగకుండా భద్రతను లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్ పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ మరోసారి హైకోర్టులో తమకు కేటాయించిన హాల్ లో దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై విచారణ కొనసాగించనున్నారు కమిషన్ సభ్యులు. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను జ్యుడీషియల్ కమిషన్ ప్రశ్నించే అవకాశాలున్నాయి. చనిపోయిన నిందితుల కుటుంబ సభ్యులు, బాధిత కుటుంబసభ్యుల నుంచి కూడా వివరాలు తీసుకునే చాన్సుంది. ఎన్ కౌంటర్ జరిగిన చటాన్ పల్లిని కమిషన్ పరిశీలించనుంది. దిశ కేసులో జనం ఆగ్రహావేశాలకు కారణమైన పరిస్థితులపైనా కమిషన్ దర్యాప్తు చేయనుంది.