ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలి..ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు

ఫోరెన్సిక్ నిపుణుల ముందు  ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలి..ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
  •     డేటా డిలీట్ చేసినట్లు తేలితే పిటిషన్ డిస్మిస్ చేస్తామని వార్నింగ్
  •     ఆయన్ను కస్టోడియల్ ఇంటరాగేషన్​కు అప్పగించాలని కోరిన ప్రభుత్వం
  •     ఆధారాలు ధ్వంసం చేయలేదన్న  పిటిషనర్ ​న్యాయవాది

న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 గా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో తన ఐక్లౌడ్ పాస్ వర్డ్ ను రీసెట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే కనీసం ఫోరెన్సిక్ నిపుణుల ఎంపికలో తమకు అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తిని సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. డివైజ్ రీసెట్ చేసిన తర్వాత ప్రభాకర్ రావు డేటా డిలీట్ చేసినట్లు తేలితే కేసు డిస్మిస్ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 18 కి వాయిదా వేసింది. 

అప్పటి వరకు అరెస్ట్ నుంచి ప్రభాకర్ రావు కు రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడగిస్తున్నట్లు స్పష్టం చేసింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎస్‌‌‌‌ఐబీ సెంటర్ గా పలువురి ఫోన్‌‌‌‌లు అక్రమంగా ట్యాపింగ్‌‌‌‌కు చేసినట్లు 2023 మార్చి 10న  పంజాగుట్ట పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో  కేసు ఫైల్ అయింది. ఇందులో ప్రభాకర్ రావును ఏ1 గా చేర్చడంతో ఆయన అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, తాను స్వదేశానికి తిరిగి వస్తానని వేసిన పిటిషన్​ను హైకోర్టు తిరస్కరించింది.

 దీంతో మే 9న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఆదేశాలు ఇవ్వడంతో ఆయన ఇండియాకు వచ్చి విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌‌‌‌ జనరల్‌‌‌‌ తుషార్‌‌‌‌ మెహతా, సీనియర్‌‌‌‌ అడ్వకేట్ సిద్ధార్థ్‌‌‌‌ లూథ్రా, ప్రభాకర్ రావు తరఫున సీనియర్ అడ్వకేట్ దామా శేషాద్రి నాయుడు హాజరయ్యారు. 

పాత హార్డ్​డిస్క్​లు ధ్వంసం చేసి కొత్తవి పెట్టారు

తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని ప్రభాకర్ రావు నిజాలు దాస్తున్నారని తెలిపారు. అందువల్ల కస్టోడియల్ ఇంటరాగేషన్ తోనే ఈ కేసులో నిజాలు బయటకు వస్తాయన్నారు. ఐఫోన్, ఐక్లౌడ్ పాస్ వర్డ్ ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే రికార్డ్ రూంలో సీసీటీవీ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసి హార్డ్ డిస్క్ ల్లోని డేటా ధ్వంసం చేశారని నివేదించారు. 

ఆ పాత వాటి స్థానంలో కొత్త వాటిని పెట్టారని వివరించారు. వామపక్ష తీవ్రవాదం, నక్సలైట్లు, మావోయిస్ట్ ల పేరుతో రాజకీయ నాయకులు, జర్నలిస్ట్ లు, జడ్జీలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఈ కేసు బహిర్గతం కాగానే.. ప్రభాకర్ రావు అమెరికా వెళ్లారని గుర్తు చేశారు. కోర్టు ఆదేశాలతో తిరిగి స్వదేశానికి వచ్చి విచారణకు హాజరవుతున్నా.. నిజాలు చెప్పడం లేదన్నారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఇస్తే.. బ్యాకప్ డేటా ఎక్కడ ఉందో రాబట్టవచ్చన్నారు.

డిపార్ట్ మెంట్​లో ఒక విభాగం డేటా డిలీట్​ చేసింది

ప్రభుత్వ వాదనలపై పిటిషనర్ ప్రభాకర్ రావు తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు అభ్యంతరం తెలిపారు. ప్రభాకర్ రావు ఎలాంటి డేటాను డిలీట్ చేయలేదన్నారు. డిపార్ట్ మెంట్ లోని ఒక విభాగమే.. సమాచారాన్ని డిలీట్ చేసిందన్నారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అడిగిన అన్ని డివైజ్ లు, సమాచారాన్ని ఇచ్చారని చెప్పారు. మధ్యలో జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకొని.. మరి ఒక డివైజ్ కు సంబంధించిన పాస్ వర్డ్ ఇవ్వలేదన్న ప్రభుత్వం ఆరోపణలపై స్పష్టత కోరారు. 

శేషాద్రి నాయుడు బదులిస్తూ.. ప్రభాకర్ రావు ఫోన్​కు​ సంబంధించిన ఐక్లౌడ్ పాస్ వర్డ్ మర్చిపోయారన్నారు. నిజంగా ప్రభాకర్ రావు డేటా డిలీట్ చేస్తే అందుకు సంబంధించిన ఫుట్ ప్రింట్స్ ఐ క్లౌడ్ లో ఉంటాయన్నారు. ప్రభాకర్ రావు పాస్ వర్డ్ మర్చిపోతే.. కేసు దాఖలైన కొద్ది రోజులకే సమాచారం డిలీట్ చేయడమేలా సాధ్యమైందని ప్రశ్నించారు.  కాగా.. ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్ వర్డ్ ను రీసెట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణుల ఎంపికలో తమకు అవకాశం ఇవ్వాలన్నారు.