- ఏటీహెచ్యూలకుపోలీస్ స్టేషన్ల హోదా కల్పించాలి
- తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, యూటీలకు ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లకు (ఏటీహెచ్యూ) పోలీస్ స్టేషన్ల హోదా కల్పించాలని స్పష్టం చేసింది.
మహిళలు, పిల్లల అక్రమ రవాణా నిరోధానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు అమలుపై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం తాజాగా సమీక్ష జరిపింది. చట్టప్రకారం తగిన నోటిఫికేషన్లను తక్షణమే జారీ చేసేలా రాష్ట్రాల హోం శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
బాధితుల రక్షణ కోసమే..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా లభించిన అధికారాలతో రూపొందించిన 'బాధితుల రక్షణ ప్రణాళిక'ను పక్కాగా అమలు చేయడానికే ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. గత మార్గదర్శకాలను కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అనైతిక వ్యాపార (నిరోధక) చట్టం కింద గుర్తింపు పొందిన సంక్షేమ సంస్థలను నోటిఫై చేయాలని, అర్హులైన సామాజిక కార్యకర్తలతో జాబితాలు సిద్ధం చేయాలని సూచించింది. పోలీస్, ప్రభుత్వ నోడల్ అధికారులను నియమించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. అప్పటికి ఉత్తర్వులు అమలయ్యేలా చూసి స్టేటస్ నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
