ముంబై రైలు పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

ముంబై రైలు పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ: 2006లో జరిగిన ముంబై రైలు బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ వెల్లడించిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే, బాంబే హైకోర్టు తీర్పుతో జైలు నుంచి రిలీజైన నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఈ తీర్పును ఇతర కేసులకు మార్గదర్శకంగా లేదా ప్రిసిడెంట్‌‌‌‌గా ఉపయోగించకూడదని కింది కోర్టులకు సూచించింది. 2006 జులై 11న ముంబై పశ్చిమ రైల్వేలైన్ లోని పలు సబర్బన్ రైళ్లల్లో వరుసగా బాంబు పేలుళ్లు జరిగాయి. 

ఈ ఘటనలో మొత్తం189 మంది చనిపోయారు. మరో 824 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రత్యేక కోర్టు..2015 అక్టోబరులో12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో ఐదుగురికి మరణశిక్ష ఖరారు చేయగా.. మిగతా ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. మరణ శిక్ష పడిన దోషుల్లో ఒకరు 2021లో కరోనాతో  నాగపూర్ జైల్లోనే మృతి చెందాడు. అయితే, స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 

దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన బాంబే హైకోర్టు..ఈ కేసులో నిందితులపై ఉన్న అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తెలిపింది. పేలుళ్లకు నిందితులు ఎలాంటి పేలుడు పదార్థాలు వాడారన్నది తేల్చి చెప్పలేకపోయారని వివరించింది. అందువల్ల 12 మంది నిందితులను నిర్దోషులుగా తేల్చి, వెంటనే వారిని రిలీజ్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీం బెంచ్.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్ పై తమ అభిప్రాయం తెలియజేయాలంటూ 12 మంది నిందితులకు నోటీసులు జారీ చేసింది.