ఎన్నికవకుండానే ఆర్నెళ్లకుపైగా మంత్రిగా ఉండడమేంటి?..దీపక్ కొనసాగింపుపై బిహార్ సర్కారుకు సుప్రీంకోర్టు ప్రశ్న

ఎన్నికవకుండానే ఆర్నెళ్లకుపైగా మంత్రిగా ఉండడమేంటి?..దీపక్ కొనసాగింపుపై బిహార్ సర్కారుకు సుప్రీంకోర్టు ప్రశ్న

న్యూఢిల్లీ: ఎన్నిక కాకుండానే ఒక మంత్రి ఆర్నెళ్లకు మించి పదవిలో ఎలా కొనసాగుతున్నారని సుప్రీంకోర్టు బిహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది పూర్తిగా రాజ్యాంగానికి సంబంధించిన అంశమని, దీనిపై రాష్ట్రం సమాధానం చెప్పాల్సిందేనని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ కేసును అత్యవసరంగా విచారిస్తూ ఆగస్టు 4కు వాయిదా వేశారు. బిహార్ పంచాయతీరాజ్ మంత్రి దీపక్ ప్రకాశ్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌‌‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో ఆయన 4 నెలల 26 రోజులు మంత్రిగా పనిచేశారు.

ఏప్రిల్ 15, 2026న ప్రభుత్వం ముగియడంతో   పదవి   ముగిసింది. ఆ తర్వాత 22 రోజులు మంత్రి పదవిలో లేరు. మే 7న సమ్రాట్ చౌధరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మళ్లీ ఆయనను మంత్రిగా నియమించారు. అయితే ఇప్పటికీ ఆయన అసెంబ్లీ లేదా శాసన మండలిలో సభ్యుడిగా ఎన్నిక కాలేదు. దీంతో మొత్తం మీద ఎన్నిక కాకుండానే ఆరు నెలలకు మించి మంత్రి పదవిలో కొనసాగుతున్నారని పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం, మంత్రి నియమితులైన వ్యక్తి ఆరు నెలల్లోగా రాష్ట్ర అసెంబ్లీ లేదా శాసన మండలికి ఎన్నిక కావాలి.

లేదంటే మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అయితే దీపక్ ప్రకాశ్ విషయంలో వరుసగా ఆరు నెలలు కాకుండా రెండు విడతల్లో పదవిలో ఉన్నారు. దీంతో రెండు విడతల కాలాన్ని కలిపి లెక్కించాలా? లేక కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరోసారి ఆరు నెలల గడువు మొదలవుతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. కానీ ఒకే వ్యక్తికి ఈ అవకాశం రెండోసారి వర్తిస్తుందా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు స్పష్టత ఇవ్వనుంది.

Deepak Prakash Minister Case, Supreme Court, Deepak Prakash, Bihar Minister, Article 164(4), Bihar Government, Samrat Chaudhary, Constitution of India, Panchayati Raj Minister, Latest News, Telugu News, Telugu News, V6 News