
- కెమెరాలు లేకపోతే ఏం జరుగుతున్నదో ఎలా తెలుస్తుంది?
- రాజస్తాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్న
- ఈ ఏడాది ఆ రాష్ట్రంలో 11 కస్టడీ మరణాలు
- మీడియా కథనాలను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్ లోని ఇంటరాగేషన్ రూంలో సీసీటీవీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని రాజస్తాన్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘‘పోలీస్ స్టేషన్ లోని ఇంటరాగేషన్ రూం చాలా కీలకమైన ప్రదేశం. అలాంటి చోట ఏం జరుగుతున్నదో తెలుసుకోవడానికి సీసీటీవీ కెమెరాలు ఉండాలి. కానీ, కెమెరాలు లేకపోతే లోపల ఏం జరుగుతున్నదో ఎలా తెలుస్తుంది?” అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ ప్రశ్నించింది.
ఈ ఏడాది రాజస్తాన్ లో జనవరి నుంచి ఆగస్టు వరకు 11 మంది పోలీసు కస్టడీలో చనిపోయారు. ఒక్క ఉదయ్ పూర్ డివిజన్ లోనే ఏడు లాకప్ డెత్ మరణాలు సంభవించాయి. ఈ మరణాలపై మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతున్నది. ఈ కేసులో రాజస్తాన్ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పై సుప్రీంకోర్టు బెంచ్ పలు ప్రశ్నలు అడిగింది. ‘‘సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కొంత ఖర్చయ్యే మాట నిజమే.
కానీ, ఇది మానవ హక్కులకు సంబంధించిన వ్యవహారం. కేసు దర్యాప్తు గురించి తెలుసుకోవడానికి ఒక మెకానిజం అనేది ఉండాలి. అది ఎలా తెలుసుకుంటారు?” అని బెంచ్ అడిగింది. ఇంటరాగేషన్ రూంలో ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు ఒక ఏజెన్సీని నియమిస్తే బాగుంటుందని బెంచ్ సూచించింది. తదుపరి విచారణను వచ్చే నెల 24కు వాయిదా వేసింది. కాగా.. ఇంటరాగేషన్ గదుల్లో నిందితుల హక్కులు ఉల్లంఘనలకు గురవుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆ రూంలలో సీసీటీవీ కెమెరాలు ఇన్ స్టాల్ చేయాలని 2018లోనే సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఎంక్వైరీ పర్యవేక్షణకు మెకానిజం అవసరమే: దవే
కేసుల ఎంక్వైరీ పర్యవేక్షణకు ఒక మెకానిజం అవసరమే అని మరో ప్రత్యేక కేసులో సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ దవే అన్నారు. సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ వంటి కేంద్ర సంస్థల ఆఫీసుల్లో సీసీటీవీ కెమెరాలు, రికార్డింగ్ పరికరాలు ఇన్ స్టాల్ చేయాలని 2020 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సిద్ధార్థ దవేను అమికస్ క్యూరీగా నియమించారు. తాజాగా ఆయన అఫిడవిట్ సమర్పించారు. ఈ కేసులో అప్ డేటెడ్ రిపోర్టును సమర్పించానని దవే చెప్పారు. అమికస్ క్యూరీ సమర్పించిన రిపోర్టుకు వివరణ ఇవ్వాలని కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.