టపాకాయల ప్రియులకు బిగ్ షాక్.. నిషేధిత క్రాకర్స్ పేల్చొద్దు..

టపాకాయల ప్రియులకు బిగ్ షాక్.. నిషేధిత క్రాకర్స్ పేల్చొద్దు..

దీపావళి వేళ టపాకాయలు పేల్చే వారికి బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. బాణసంచాలో బేరియం, నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశమంతటా వర్తిస్తాయని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది . ఇలాంటి  టపాకాయలు పేల్చొద్దని తేల్చి చెప్పింది. పేల్చడమే కాదు.. టపాసుల విక్రయాలు, కొనుగోళ్లు, వాడకానికి అనుమతి ఇచ్చేది లేదంటూ ఖరాకండిగా చెప్పేసింది. దేశ రాజధాని ఢిల్లీకే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని సుప్రీంకోర్టు తెలిపింది. 

వాతావరణ కాలుష్యం పెరుగుతున్న వేళ సుప్రీంకోర్టు  కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పర్వదినాన  నిషేధిత టపాసుల విక్రయాలు, కాల్చడాన్ని నిషేధించింది.. నిషేధిత పటాకులను  తయారుచేసినా.. విక్రయించినా.. పేల్చినా... ఆయా రాష్ట్రాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,హోంశాఖ కార్యదర్శి , అక్కడి పోలీస్ కమిషనర్,  జిల్లా ఎస్పీ,  పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ SHO/పోలీసు అధికారి వ్యక్తిగతంగా బాధ్యులవుతారని  జస్టిస్  MR షా,  AS బోపన్నలతో కూడిన ధర్మాసనం 2021లో ఉత్తర్వులు జారీ చేశారు. 

బేరియం క్రాకర్స్  నిషేధంపై దాఖలైన పిటిషన్ ను  జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌ ద్విసభ్య ధర్మాసనం  విచారించింది.  వాయు, శబ్ధ కాలుష్యాన్ని తగ్గించడంపై అపెక్స్ కోర్టు ఆదేశాలను పాటించేలా రాజస్థాన్ రాష్ట్రానికి ఆదేశాలు ఇవ్వాలని  పిటిషన్ దాఖలైంది.  ఈ పిటిషన్ కు తాజా ఆదేశాలు అవసరం లేదని ...  గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని సుప్రీంకోర్టు తెలిపింది.  పండుగ సీజన్ లోనే కాకుండా.. వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి  ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటాయని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీపావళి క్రాకర్లలో నిషేధిత  రసాయనాలను ఉపయోగించరాదని 2021లో  సుప్రీంకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.పటాకులపై పూర్తి నిషేధం లేదని ..  బేరియం లవణాలు ఉన్న బాణాసంచాపైనే నిషేధం విధించామని స్పష్టం చేసింది. అయితే 2018 లో సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ ను పేల్చేందుకు  అనుమతిచ్చింది.