పానం బాగుంటలే..శిక్ష కొట్టేయండి : ఆశారాం బాపూ

పానం బాగుంటలే..శిక్ష కొట్టేయండి : ఆశారాం బాపూ
  • సుప్రీంలో ఆశారాం పిటిషన్

న్యూఢిల్లీ: తన ఆరోగ్యం క్షీణిస్తున్నదని.. జైలు శిక్షను సస్పెండ్ చేయాలని.. బాలికపై రేప్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వివాదాస్పద బాబా ఆశారాం బాపూ వేసిన పిటిషన్‌‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటివి ఎంటర్ టైన్ చేయబోమంటూ పిటిషన్​ను శుక్రవారం కొట్టేసింది. పోలీసు కస్టడీలో ట్రీట్​మెంట్ తీసుకోవాలని  సూచించింది. 

ఆశారాంకు పలుమార్లు గుండెపోటు వచ్చిందని, పలు ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరఫున సీనియర్ లాయర్​ ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. పిటిషన్​ను త్వరగా విచారించాలని ఆయన కోరడంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన బెంచ్ దాన్ని పరిశీలించింది. వృద్ధాప్యం వల్ల ఆశారాం వీక్​గా ఉన్నారని.. గుండె జబ్బులు, ప్రోస్టాటిక్ హైపర్‌‌ ప్లాసియా, డయాబెటిస్, హైపర్‌‌టెన్షన్, కొవిడ్- న్యుమోనియా, యూరోసెప్సిస్, హైపోథైరాయిడిజం, జీర్ణాశయంలో రక్తస్రావం సహా పలు ప్రాణాంతక వ్యాధులు వేధిస్తున్నాయని.. గుండె బైపాస్ సర్జరీతో బతుకుతానని ఆయన నమ్మడం లేదని.. ఆయన శిక్షను సస్పెండ్​ చేయాలని పిటిషన్​లో కోరారు. 

వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ఇలాంటి వాటిని ఎంటర్​టైన్​ చేయబోమని తెలిపారు. పిటిషన్ విచారణకు స్వీకరించకుండా కొట్టివేశారు. దీంతో మహారాష్ట్రలోని ఖోపోలీలోని మాధవ్‌‌బాగ్ హార్ట్ హాస్పిటల్‌‌లో పోలీసు కస్టడీలో ట్రీట్ మెంట్​ చేయించుకోవచ్చన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచనను అంగీకరించేందుకు ఆశారాం సుముఖంగా ఉన్నారని అతని తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. దీంతో రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించాలని ఆశారాం బాపూ లాయర్లకు సూచిస్తూ.. అదికూడా చట్ట ప్రకారం పరిగణనలోకి తీసుకుంటారని తెలిపింది.