
- అజ్మీరా శ్యాం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో కీలక సమాచారాన్ని దాచిపెట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యాం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఐటీ రిటర్న్‌లతో పాటు జీతం, ఇతర ఆర్థిక పరమైన అంశాలను వారంలోగా సమగ్ర వివరాలతో రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని కోవా లక్ష్మీని ఆదేశించింది. 2023 ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి అజ్మీరా శ్యాం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కోవా లక్ష్మీ చేతిలో ఓడిపోయారు.
అయితే, కోవా లక్ష్మీ 2018-నుంచి 22 వరకు నాలుగేండ్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించలేదని, జీతం పొందుతున్నా తన ఆదాయాన్ని 'నీల్'గా చూపించారని ఆరోపిస్తూ అజ్మీరా శ్యాం హైకోర్టును ఆశ్రయించారు. కోవా లక్ష్మీ ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చారని..ఆమె ఎన్నిక చెల్లదని పిటిషన్ లో పేర్కొన్నారు. హైకోర్టు స్పందిస్తూ.. అజ్మీరా శ్యాం వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అజ్మీరా శ్యాం.. గతేడాది నవంబర్ 21 న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను సోమవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఎన్ కె సింగ్ లతో కూడిన బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా శ్యాం తరపు అడ్వకేట్ వాదిస్తూ..లక్ష్మీ తన అఫిడవిట్ లో ఐటీ రిటర్న్స్, ఇతర అంశాలను పొందపరచలేదని ఆరోపించారు. నిబంధనలను పాటించకుండా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం ఆమె ఎన్నిక చెల్లదని వాదించారు.
కోవా లక్ష్మీ తరపు అడ్వకేట్ వాదిస్తూ.. ఐటీ రిటర్న్‌లతో పాటు జీతం, ఇతర ఆర్థికపర అంశాలను అఫిడవిట్ లో పొందుపరిచారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఎక్కడ నిబంధనలను ఉల్లఘించలేదని కోర్టుకు నివేదించారు. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలను రాతపూర్వకంగా కోర్టుకు సమర్పిస్తామని అభ్యర్థించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం... వారం రోజుల్లో రాతపూర్వకంగా వివరాలు సమర్పించాలని కోవా లక్ష్మీని ఆదేశించింది. అలాగే.. తీర్పును రిజర్వ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.