సుప్రీంకోర్టులో క్రికెటర్ శ్రీశాంత్‌కు ఊరట

సుప్రీంకోర్టులో క్రికెటర్ శ్రీశాంత్‌కు ఊరట

భారత క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.  ఐపీఎల్‌‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై కేరళకు చెందిన శ్రీశాంత్‌పై బిసిసిఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత్తివేసింది. శ్రీశాంత్‌కు విధించిన జీవితకాల నిషేధ శిక్షను పున:సమీక్షించాలని  శుక్రవారం సుప్రీంకోర్టు  బీసీసీఐని ఆదేశించింది.  2013 ఐపీఎల్‌‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు బీసీసీఐ క్రమశిక్షణ సంఘం నిర్ధారించడంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని విధించింది. అయితే స్పాట్ ఫిక్సింగ్ లో తన ప్రమేయం ఏమీ లేదని, తాను ఎలాంటి తప్పూ చేయలేదని శ్రీశాంత్ చెబుతూ వచ్చారు.

తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ 2017 ఆగస్టులో కేరళా హైకోర్టు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని సింగిల్ బెంచ్ కొట్టేయగా…బీసీసీఐ కేరళా హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించింది.  కేరళా హైకోర్టు డివిజన్ బెంచ్ శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. కేరళా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు అశోక్ భూషణ్, కేఎం జోసఫ్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్…మార్చి 1న తీర్పును రిజర్వ్‌ చేశారు. శ్రీశాంత్‌ తరఫు న్యాయవాది సల్మాన్‌ ఖుర్షిద్‌ శుక్రవారం ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు.

శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం సరికాదని తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్…ఆయనకు విధించాల్సిన శిక్ష మోతాదును సవరిస్తూ బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీనికి సంబంధించి బీసీసీఐకి సుప్రీంకోర్టు మూడు మాసాల గడువు ఇచ్చింది. బీసీసీఐ క్రమశిక్షణ సంఘం ఎదుట తన తరఫు వాదనను వినిపించేందుకు కూడా సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది.