ఎట్టకేలకు అర్థం చేసుకున్నరు : సుప్రీంకోర్టు

ఎట్టకేలకు అర్థం చేసుకున్నరు : సుప్రీంకోర్టు
  • పతంజలి క్షమాపణల యాడ్స్​పై సుప్రీం సంతృప్తి 

న్యూఢిల్లీ: పతంజలి సంస్థ ఎట్టకేలకు తమ ఆదేశాలను అర్థం చేసుకున్నదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సంస్థ బహిరంగ క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలపై సంతృప్తి వ్యక్తం చేసింది. పతంజలి తప్పుడు ప్రకటనల కేసుపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లాతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పతంజలి వ్యవస్థాపకులు బాబా రామ్​దేవ్, బాలకృష్ణ తరఫున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

 కోర్టు ఆదేశాల మేరకు బహిరంగ క్షమాపణలు చెబుతూ పెద్ద సైజులో మళ్లీ యాడ్స్ ఇచ్చామని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన బెంచ్.. ‘‘ఎట్టకేలకు మా ఆదేశాలను వాళ్లు అర్థం చేసుకున్నారు. అందుకు అభినందిస్తున్నాం. మొదటి యాడ్ కు, రెండో యాడ్ కు చాలా తేడా ఉంది. అందులో వాడిన భాష కూడా సరిపోతుంది. 

ఈసారి కంపెనీ ఫౌండర్ల పేర్లు కూడా పబ్లిష్ చేశారు” అని సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే బహిరంగ క్షమాపణలు చెబుతూ యాడ్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్రింట్ కాపీలను అందజేయాలని ఇంతకుముందు ఆదేశించగా, ప్రింట్ కాపీలు కాకుండా ఈ–కాపీలను అందజేయడంపై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో చివరి అవకాశం ఇస్తున్నామని, అన్ని పేపర్లలో పబ్లిష్ అయిన యాడ్స్ ఒరిజినల్ కాపీలను అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.

ఇప్పుడు నిద్ర లేచారా..?

పతంజలి, దివ్య ఫార్మసీకి చెందిన 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ నిషేధం విధించింది. ఈ విషయాన్ని అఫిడవిట్​ ద్వారా ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇప్పుడు నిద్ర లేచారా? అంటూ ఫైర్ అయింది.  కాగా, పతంజలి సంస్థకు జీఎస్టీ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. రూ.27.46 కోట్ల ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్​ను వడ్డీతో సహా ఎందుకు వసూలు చేయొద్దో చెప్పాలని  అందులో పేర్కొంది.