
బీహార్ లో 65 లక్షల ఓట్ల తొలగింపుపై నమోదైన ప్రత్యేక పిటిషన్ ను విచారణకు స్వీకరించింది సుప్రీం కోర్టు. ఈ సందర్భంగా ఓట్ల తొలగింపుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) లో భాగంగా ఎన్నికల లిస్టుకు సంబంధించిన డ్రాఫ్టును ఆగస్టు 1న ఈసీ పబ్లిష్ చేసింది. ఒకవైపు ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తు్న్నాయి. మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదైంది.
బీహార్ కొత్త ఎన్నికల లిస్టు డ్రాఫ్టును పబ్లిష్ చేసిన సందర్భంగా.. ఓట్ల తొలగింపుపై నమోదైన పిటిషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బెంచ్.. ఆగస్టు 9 వరకు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సూచించింది. ఈ కేసులో వాదనలు ఆగస్టు 12 ఉన్నందున 9 వరకు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సూచించింది.
బీహార్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత శుక్రవారం(ఆగస్టు 1) ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఇందులో ఏకంగా 65.2 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమం ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దడం, డూప్లికేట్ ఎంట్రీలను తొలగించడం, మరణించిన ,వలస వెళ్ళిన ఓటర్ల వివరాలను అప్‌డేట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని 7.89 కోట్ల మంది నమోదైన ఓటర్లలో 91.69% మంది అంటే దాదాపు 7.24 కోట్లు మంది తమ గణన ఫారాలను (Enumeration Forms - EFలు) సమర్పించినట్లు ECI గతంలో ప్రకటించింది.
విడుదలైన ముసాయిదా జాబితా ప్రకారం..మొత్తం 65.2 లక్షల మంది ఓటర్ల పేర్లను వివిధ కారణాలతో తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన 22లక్షల34వేల 501 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. వలసవెళ్లడం, అడ్రస్ దొరక్కపోవడంతో 36లక్షల28వేల210 మంది ఓటర్ల పేర్లను లిస్టునుంచి తొలగించారు. ఇక 7లక్షల 01వేల364 మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో నమోదు చేసుకున్న కారణంగా వారి ఓట్లను తొలగించినట్లు ఈసీ ప్రకటించింది. అయితే బీజేపీకి, దాని అనుబంధ పార్టీలకు మేలు చేసేందుకే ఎన్నికల కమిషన్ 65 లక్షల ఓట్లను తొలగించినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
బీహార్ ఓట్ల తొలగింపు అంశంపై పార్లమెంటులో చర్చించడం కుదరదు: కేంద్రం
ఓట్ల తొలగింపు అంశం పార్లమెంటు ఉభయసభలను కుదిపేస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట, కర్ణాటక మాదిరగానే బీహార్ లో కూడా భారీ ఎత్తున ఓటర్లను తొలగించి ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోందిన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగా ఎన్నికల సంఘం ఓట్లను తొలగించి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి సహకరిస్తోందని గత కొంతకాలంగా ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు అవకాశం ఇవ్వాలని బుధవారం (ఆగస్టు 06) విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి.
బీహార్ ఓట్ల తొలగింపు అంశంపై పార్లమెంటులో చర్చించడం కుదరదని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. బీహార్ ఓట్ల తొలగింపు అంశం సుప్రీం కోర్టు ముందు ఉన్నందున.. పార్లమెంటులో చర్చించడం కుదరదని స్పంష్టం చేశారు. అయినా ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో జ్యుడీషియల్ విచారణలో ఉన్న అంశాలను లోక్ సభలో చర్చించేందుకు నిబంధనలు ఒప్పుకోవని తెలిపారు.