మంత్రి అయ్యుండి ఇలాంటి కామెంట్లేంది?

మంత్రి అయ్యుండి ఇలాంటి కామెంట్లేంది?

న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్​ చేసిన కామెంట్లను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు చేసిన కామెంట్ల ప్రభావం మీకు తెలియదా?’ అని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని వాక్​ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛను దుర్వినియోగం చేశారని అసహనం వ్యక్తం చేసింది. ఓ ప్రైవేటు సమావేశం సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ, సామాజిక న్యాయానికి, సమానత్వానికి సనాతన ధర్మం విరుద్ధమని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బెంగళూరు, పాట్నా, జమ్మూ సహా ఆరు రాష్ట్రాల్లో ఆయనపై ఎఫ్‌‌ఐఆర్‌‌లు నమోదయ్యాయి. 

అయితే, ఈ కేసులన్నింటినీ ఒకే రాష్ట్రంలోని హైకోర్టుకు బదిలీ చేయాలంటూ ఉదయనిధి తరఫు లాయర్ పిటిషన్​లో కోరారు. మంత్రి ఆరు రాష్ట్రాల హైకోర్టులకు తిరగాల్సి వస్తోందన్నారు. ఈ పిటిషన్​పై సుప్రీం కోర్టు సోమవారం విచారించింది. ఒకే కోర్టుకు బదిలీ చేస్తే అప్పుడు కాశ్మీర్​కు చెందిన ఒక సాక్షి వేరే రాష్ట్ర కోర్టుకు ఎందుకు పోవాలో కారణాలు చెప్పండని లాయర్​ను ప్రశ్నించింది. దీంతో లాయర్ బదులిస్తూ.. అర్నాబ్ గోస్వామి, జుబేర్, నుపుర్​ శర్మ కేసుల విషయంలోనూ సుప్రీం కోర్టు గతంలో ఇలాంటి వెసులుబాటు కల్పించిందని గుర్తుచేశారు. కాగా, ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది.