పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.. మాస్కులు సరిపోవు: ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన

పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.. మాస్కులు సరిపోవు: ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు క్షీణిస్తోన్న వాయు నాణ్యతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా తీవ్ర స్థాయిలో ఉందని.. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మాస్క్‌లు మాత్రమే సరిపోవని పేర్కొంది. న్యాయవాదులు విచారణలకు వర్చువల్‌గా హాజరు కావాలని సూచించింది. 

ఢిల్లీ గాలి కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై గురువారం (నవంబర్ 13) జస్టిస్ పీఎస్ నర్సింహ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలో దారుణంగా పడిపోతున్న గాలి నాణ్యతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పరిస్థితి చాలా చాలా తీవ్రంగా ఉందన్నారు. సుప్రీంకోర్టులో వర్చువల్ హియరింగ్ సౌకర్యం ఉందని.. న్యాయవాదులు ఆ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

ఎందుకంటే ఈ కాలుష్యం శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. అయితే.. లాయర్లు మాస్కులు ధరిస్తున్నారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించగా.. ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి మాస్క్‌లు సరిపోవుని జస్టిస్ పీఎస్ నర్సింహ అన్నారు. ఈ అంశంపై సీజేఐతో కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. 

కాలుష్య కోరల్లో ఢిల్లీ:

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ.. ఢిల్లీ –-ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ఢిల్లీ ‘గ్యాస్ చాంబర్’గా మారింది. అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయింది. 

అలీపూర్, బవానా, బురారీ క్రాసింగ్, ఐటీఓ, జహంగీర్ పురి, నరేలా, నెహ్రూ నగర్, వివేక్ విహార్, వజీర్‌‌‌‌‌‌‌‌పూర్, రోహిణి, ఆర్కేపురం, ద్వారాక వంటి 9కి పైగా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 400 పాయింట్లు దాటింది. పలు ప్రాంతాలను రెడ్ జోన్‌‌‌‌లో చేర్చారు. క్రమంగా పడిపోతోన్న ఉష్ణోగ్రతలు వాయు కాలుష్యానికి కారకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (డీఆర్ఏపీ) మూడో దశను అమలు చేయాలని నిర్ణయించారు. 

►ALSO READ | రూ. 12 వేల కోట్ల మనీలాండరింగ్ కేసు: జేపీ ఇన్‌ఫ్రాటెక్ ఎండీ అరెస్ట్..

ప్రస్తుతం ఢిల్లీలో గాలి పీల్చడం అత్యంత హానికరంగా మారింది. పర్యావరణ డేటా ప్రకారం.. రోజుకు ఒకటి కంటే ఎక్కువ సిగరేట్లు కాల్చడంతో సమానమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. చాలా తక్కువ ఏక్యూఐ నమోదైన ప్రాంతాల్లో నివసించే ప్రజలు రోజుకు 6 నుంచి 10 సిగరెట్లు తాగినంత హానికరమైన గాలిని పీల్చుతున్నట్లు హెచ్చరిస్తున్నారు. 

400కు పైగా ఏక్యూఐ నమోదైన ఏరియాలో ఉన్న వారు ఏకంగా 16 నుంచి 20 సిగరెట్లు తాగిన వారితో సమానం అని చెబుతున్నారు. దీంతో అత్యవసర పరిస్థితులు ఉంటేనే ప్రజలు బయటకు రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎన్సీఆర్ పరిధిలో పెద్ద సంఖ్యలో శ్వాస సంబంధిత సమస్యతో హాస్పిటల్స్‌‌‌‌లో చేరిన వారి సంఖ్య పెరిగినట్లు తెలిపారు.