జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ (JIL) మేనేజింగ్ డైరెక్టర్ (MD) మనోజ్ గౌర్‌ను మనీలాండరింగ్ కేసు కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది. ఫ్లాట్లు కొనుక్కున్నవారు కట్టిన సుమారు రూ. 12వేల కోట్ల డబ్బును ఫ్లాట్లు కట్టడానికి వాడకుండా వాటిని ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి.
మనోజ్ గౌర్ కు చెందిన రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీలైన జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్, జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్, అలాగే వాటి అనుబంధ సంస్థలకు సంబంధించిన 15 ప్రదేశాల్లో మే నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఈ ఆపరేషన్ సమయంలో అధికారులు రూ.1.7 కోట్ల విలువైన నగదుతో పాటు ఫైనాన్షియల్ రికార్డులు, డిజిటల్ డేటా & ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యులు అలాగే గ్రూప్ కంపెనీల పేర్లపై రిజిస్టరైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, ముంబై, నోయిడా సహా ఘజియాబాద్ అంతటా ఈ దాడులు జరిగాయి. IDBI బ్యాంక్‌కు రూ. 526 కోట్లపైగా చెల్లించడంలో JIL విఫలమైంది. దీంతో, IDBI బ్యాంక్ 2017 ఆగస్టు 9న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో పిటిషన్ వేయడంతో JIL కంపెనీపై దివాలా (Bankruptcy) ప్రక్రియ మొదలైంది.
JIL ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు బుక్ చేసుకున్న 21 వేల మందికి పైగా కొనుగోలుదారుల డబ్బు మళ్లించబడటంతో తీవ్రంగా నష్టపోయారు. వీరి సమస్యను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. దీని ఫలితంగా ఇళ్ల కొనుగోలుదారులను కూడా బ్యాంకులు లాగే 'ఆర్థిక రుణదాతలు'గా గుర్తించేలా చట్టంలో మార్పు (IBCకి సవరణ) వచ్చింది. దీంతో వారికి పరిష్కార ప్రక్రియలో ఓటు హక్కు లభించింది. చాలా చర్చలు, బిడ్డింగ్‌ల తర్వాత సురక్ష గ్రూప్ ఇచ్చిన పరిష్కార ప్రణాళికను NCLAT 2024 మేలో ఆమోదించింది. ఈ ప్లాన్ ప్రకారం, సురక్ష గ్రూప్ మిగిలిపోయిన ఫ్లాట్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, భూసేకరణ నిబంధనలలో భాగంగా రైతులకు మెరుగైన పరిహారాన్ని చెల్లించాలి.
