షాహీ ఈద్గాలో సర్వేపై సుప్రీంకోర్టు స్టే

షాహీ ఈద్గాలో సర్వేపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. టెంపుల్ పక్కనున్న షాహీ ఈద్గాలో కోర్టు పర్యవేక్షణలో సర్వే నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. షాహీ ఈద్గాలో సర్వే నిర్వహించేందుకు, దాని పర్యవేక్షణకు గాను కోర్టు కమిషనర్​ను నియమించేందుకు అనుమతిస్తూ గతేడాది డిసెంబర్ 14న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఈ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. సర్వే కోసం కోర్టు కమిషనర్​ను నియమించాలంటూ హిందూ సంఘాలు ఫైల్ చేసిన పిటిషన్​పై చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయని బెంచ్ తెలిపింది. ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందన కోరుతూ హిందూ సంఘాలకు నోటీసులు జారీ చేసింది.