మా ఆదేశాలంటే లెక్కలేదా... మహారాష్ట్ర స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

మా ఆదేశాలంటే లెక్కలేదా...  మహారాష్ట్ర స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

మహారాష్ట్ర స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్  షిండే  వర్గానికి  చెందిన  శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంపై  స్పీకర్‌ చేస్తున్న జాప్యంపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది.  తమ అదేశాలు అపహాస్యమా, ఇదేమైనా ఆషామాషీ విషయమని అనుకుంటున్నారా  అంటూ ప్రశ్నించింది.   సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయలేరని ఎవరైనా స్పీకర్‌కు సలహా ఇవ్వడంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పీకర్‌ కాస్త విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని తాము   భావించామని తెలిపింది.  

శివసేనలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన  ఏక్నాథ్   షిండే,  ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం ఆదేశించినా స్పీకర్‌ జాప్యం చేస్తున్నారంటూ ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన సునీల్‌ ప్రభు, ఎన్సీపీలోని శరద్‌ పవార్‌ మద్దతుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న సీజేఐ ధర్మాసనం ఈ  వ్యాఖ్యలు చేసింది.