- మైనర్లు, నేర చరిత్ర లేనోళ్లను రిలీజ్ చేయండి
- స్టూడెంట్లపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను దర్యాప్తు చేయొచ్చు
- కానీ బలవంతపు చర్యలు వద్దు: సుప్రీంకోర్టు
- పోలీసుల బలప్రయోగంపై ఎంక్వైరీ అవసరమని వ్యాఖ్య
- సుప్రీం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో సిట్ ఏర్పాటును పరిశీలిస్తం
- అన్ని డిజిటల్ ఆధారాలు భద్రపరచాలని ఆదేశం
- నిరసనలపై చర్యలకు దేశవ్యాప్తంగా
- ఒకే ప్రొటోకాల్ అవసరమన్న సీజేఐ
- ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు ఓకే.. కానీ బలవంతపు చర్యలు వద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై ఆందోళనలకు సంబంధించి అరెస్టు చేసిన విద్యార్థుల్లో 18 ఏళ్లలోపు వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, మైనర్లలో క్రిమినల్ కేసుల చరిత్ర లేని వారికే ఈ రక్షణ వర్తిస్తుందని స్పష్టం చేసింది. విద్యార్థులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ జడ్డి నేతృత్వంలో స్పెషల్‌ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించింది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌తో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్మంగళవారం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల దర్యాప్తును ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలు కొనసాగించవచ్చని, అయితే నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మహారాష్ట్ర, బిహార్, అస్సాం, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసి, విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.
చట్టాన్ని చేతిలోకి తీసుకున్నోళ్లపై చర్యలు
విద్యార్థులపై పెల్లెట్ గన్స్, మేకులతో కూడిన లాఠీలు, రబ్బర్ బుల్లెట్లు, ఎలక్ట్రిక్ బ్యాటన్లు వాడి తీవ్రంగా గాయపరిచారనే ఆరోపణలు మొదటి విచారణలోనే స్వతంత్ర దర్యాప్తు అవసరాన్ని సూచిస్తున్నాయని బెంచ్వ్యాఖ్యానించింది. మరోవైపు, 250 మంది పోలీసులకు గాయాలైన ఘటనల వెనుక ఉన్నది విద్యార్థులా..? లేక సంఘవిద్రోహ శక్తులా..? అనేది కూడా దర్యాప్తులో తేలాలని పేర్కొంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యలు తప్పవని, బాధ్యులను గుర్తించకపోతే దర్యాప్తుకు అర్థం ఉండదని కోర్టు స్పష్టం చేసింది.
గతంలో కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను పోలీసులు పూర్తిగా పాటించలేదని, నిరసనల టైంలో దేశవ్యాప్తంగా ఒకే ప్రొటోకాల్ అమలు చేయాల్సిన టైమొచ్చిందని సీజేఐ అన్నారు. నిరసనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, డ్రోన్ వీడియోలు, బాడీ కెమెరా రికార్డులు, వైర్‌లెస్ కమ్యూనికేషన్ రికార్డులు, పీసీఆర్ లాగ్‌లు తదితర అన్ని డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. విద్యార్థుల తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ పోలీసుల బలప్రయోగానికి సంబంధించిన ఆధారాలు సమర్పించారు. కేంద్రం తరఫున ఎస్జీ తుషార్ మెహతా మాట్లాడుతూ.. పోలీసు బలగాల మనోధైర్యం దెబ్బతినకుండా చూడాలని కోరారు.
