
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం తుది తీర్పు వెల్లడించనుంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని 2019 ఆగస్ట్ 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ప్రత్యేక హోదాను జమ్మూకాశ్మీర్ కోల్పోయింది. అయితే, రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అనేక పిటిషన్లు దాఖలు కాగా, సుప్రీం కోర్టులో వాటిపై వాదనలు ముగిశాయి. మొత్తం 16 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఈ తీర్పును సోమవారం వెల్లడించనుంది.