ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు తీర్పు

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు తీర్పు

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు.. విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యు.యు.లలిత్‌, న్యాయమూర్తులు జస్టిస్​ దినేశ్​ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఆరున్నర రోజల పాటు సాగిన సుదీర్ఘ విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ఇవాళ తీర్పు వెలువరించనుంది. 

ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు.. విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడంపై సుప్రీంకోర్టులో 40 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనని కొందరు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న నియమాన్ని,క్రిమీలేయర్‌ విధానాన్ని అతిక్రమిస్తోందని వాదించారు. ఆ కోటా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మినహాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వారు తప్పుబట్టారు.  కాగా.. ఈ చట్టాన్ని 2019, ఫిబ్రవరి 1న కేంద్రం అమలులోకి తెచ్చింది.