ఒంటరి తల్లుల పిల్లలకు బీసీ సర్టిఫికెట్లు..కేంద్రం వివరణ కోరిన సుప్రీం

ఒంటరి తల్లుల పిల్లలకు బీసీ సర్టిఫికెట్లు..కేంద్రం వివరణ కోరిన సుప్రీం

న్యూఢిల్లీ: ఒంటరి తల్లుల పిల్లలకు బీసీ సర్టిఫికెట్ల జారీపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఒక ఒంటరి తల్లి ఓబీసీ అయినప్పటికీ.. ఆమె కమ్యూనిటీ, సర్టిఫికెట్​ ఆధారంగా ఆమె పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వడంలో సమస్య ఏముంది? ఒంటరి తల్లలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై ఆలోచన చేయాలి” అని జస్టిస్​ కేవీ విశ్వనాథన్​, జస్టిస్​ కోటీశ్వర్​ సింగ్​తో కూడి డివిజన్​ బెంచ్​ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 ఢిల్లీకి చెందిన ఓబీసీ మహిళ, ఒంటరి తల్లి తన పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ల కోసం జనవరి 31న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను భర్త నుంచి విడిపోయానని, తన పిల్లలకు క్యాస్ట్​ సర్టిఫికెట్​ కావాలంటే తండ్రి  క్యాస్ట్​ సర్టిఫికెట్​ లేదా ఆయన రక్తసంబంధీకుల(తాత, చిన్నాన్న, పెద్దనాన్న) సర్టిఫికెట్​ అయినా కావాలని అధికారులు అంటున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు. 

‘‘ప్రస్తుత నిబంధనల ప్రకారం.. తండ్రి, లేదా తండ్రి తరఫు రక్తసంబంధీకుల సర్టిఫికెట్​ ఆధారంగానే పిల్లలకు క్యాస్ట్​ సర్టిఫికెట్ ఇస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒంటరి తల్లుల పిల్లల హక్కులను హరించేలా ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఒంటరి తల్లుల సర్టిఫికెట్​ ఆధారంగానే పిల్లలకు సర్టిఫికెట్​ జారీ చేస్తున్నారు. 

ఓబీసీలకు  ఇది వర్తించట్లేదు” అని పిటిషనర్​ తరఫు న్యాయవాది గుర్తుచేశారు.  ‘‘ఇది ముఖ్యమైన అంశం” అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై ఏమంటారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. విడాకులు తీసుకున్న ఓబీసీ మహిళ.. పిల్లలకు క్యాస్ట్​ సర్టిఫికెట్​ కోసం భర్తపై ఆధారపడాల్సిన అవసరం ఏముందని సుప్రీం బెంచ్​ అడిగింది. ఇంటర్​క్యాస్ట్​ మ్యారేజీల విషయంలోనూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.