- యాదాద్రి– వరంగల్ ఎన్‌హెచ్ 163 విస్తరణపై దాఖలైన పిటిషన్ డిస్మిస్
న్యూఢిల్లీ, వెలుగు: యాదాద్రి-వరంగల్ నేషనల్ హైవే(ఎన్‌హెచ్)–163 విస్తరణలో భూమలు కోల్పోయిన నిర్వాసితులకు పెంచిన పరిహారాన్ని ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సమర్థించింది. ఈ తీర్పుపై స్టే విధించాలన్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) అభ్యర్థనను తోసిపుచ్చింది. యాదాద్రి– వరంగల్ ఎన్‌హెచ్–163 విస్తరణ పనుల కోసం ఎన్‌హెచ్ఏఐ భూ సేకరణ చేపట్టింది.
ఈ వ్యవహారంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పెంచిన పరిహారాన్ని తీసుకునేందుకు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. వాద ప్రతివాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. స్టే ఇచ్చేందుకు తగిన ఆధారాలు గానీ, కారణాలు గానీ తమకు కనిపించడం లేదని అభిప్రాయపడింది. అందువల్ల ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది.
