అసంతృప్తే తప్ప నిరాశ చెందట్లే : గులాం నబీ ఆజాద్

అసంతృప్తే తప్ప నిరాశ చెందట్లే :  గులాం నబీ ఆజాద్

శ్రీనగర్ :  సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జమ్మూకాశ్మీర్​లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) చైర్‌‌పర్సన్ గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ..‘‘ఇది దురదృష్టకరం, అయితే ప్రతి ఒక్కరూ బరువెక్కిన హృదయంతో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అంగీకరించాలి. జమ్మూ కాశ్మీర్ ప్రజల మనోభావాలను, చారిత్రక నేపథ్యాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని భావించాం” అని ఆజాద్ పేర్కొన్నారు. ‘‘జమ్మూకాశ్మీర్ చరిత్రలో ఇది ఒక విచారకరమైన రోజు, ఎందుకంటే మరే ఇతర ప్రత్యామ్నాయం లేదు.  జమ్మూ కాశ్మీర్‌‌లోని రాజకీయ పార్టీలను సంప్రదించి ఉంటే, బహుశా ఏదైనా చేసే అవకాశం ఉంటుండేనేమో” అని ఆజాద్​అన్నారు.

నేషనల్​కాన్ఫరెన్స్​ ఉపాధ్యక్షుడు ఒమర్ ​అబ్దుల్లా మాట్లాడుతూ..‘‘ సుప్రీం కోర్టు తీర్పుతో అసంతృప్తిగా ఉన్నాం. కానీ నిరుత్సాహపడట్లేదు. ఆర్టికల్‌‌ 370ని రద్దు చేయడానికి బీజేపీకి కొన్ని దశాబ్దాలు పట్టింది. దీనిపై మా పోరాటం కొనసాగుతుంది’’ అని అన్నారు. పీడీపీ చీఫ్ ​మెహబూబా ముఫ్తి మాట్లాడుతూ..   ‘‘సుప్రీంకోర్టు తీర్పుతో నిరుత్సాహ పడటంలేదు. ఈ విషయంలో జమ్మూకాశ్మీర్‌‌ ఎన్నో ఒడిదుడుకులు చూసింది. ఎవరూ ధైర్యాన్ని, ఆశను కోల్పోవద్దు. ఓటమిని అంగీకరించ వద్దు” అని అన్నారు.