నాన్నతో ప్రాణహాని…సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా: అమృత

నాన్నతో ప్రాణహాని…సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా: అమృత

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య కేసులో నిందితులకు బెయిల్‌ లభించడంపై అతని కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జరిగిన ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీంలకు నిన్న(శుక్రవారం) హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపై స్పందించిన ప్రణయ్‌ భార్య అమృత.. భారత దేశ న్యాయవ్యవస్థ తీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేసిన వారిపై పీడీ యాక్ట్‌ కొట్టివేసి బెయిల్‌పై విడుదల చేయడం దారుణమన్నారు. నిందితులు బయటకు రావడంతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపారు. దీనిపై హైకోర్టుకు అప్పీలు చేస్తామని..అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

తన తండ్రి బయటకు రావడంతో, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అమృత. తమకు సెక్యూరిటీని పెంచాలని జిల్లా ఎస్పీ రంగనాథ్‌ ను కోరారు.  నిందితుల బారి నుంచి ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు ఎటువంటి ముప్పు కలగకుండా రక్షణ కల్పిస్తామన్నారు ఎస్పీ.