చట్ట విరుద్ధమని తేలితే సర్ ను పక్కనపెడ్తం

చట్ట విరుద్ధమని తేలితే సర్ ను  పక్కనపెడ్తం
  • ఈసీని హెచ్చరించిన సుప్రీంకోర్టు
  • ‘సర్’​పై అసంపూర్తి అభిప్రాయం వెల్లడించలేం
  • తుది తీర్పు పాన్ ఇండియా​కు వర్తించేలా ఉంటుంది
  • అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని వెల్లడి

న్యూఢిల్లీ: బిహార్​లో చేపడ్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చట్టవిరుద్ధమని తేలితే.. మొత్తం ప్రక్రియను పక్కన పెట్టేస్తామని ఎన్నికల కమిషన్​ను సుప్రీం కోర్టు హెచ్చరించింది. అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్​మాల్య బాగ్చి బెంచ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశంపై తాము అసంపూర్తి అభిప్రాయం వెల్లడించలేమని, తుది తీర్పు పాన్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్ కు వర్తించేలా ఉంటుందని తెలిపింది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్.. బిహార్ సర్ ప్రక్రియలో చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని బెంచ్ పేర్కొంది. బిహార్ సర్ ప్రక్రియలో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్‌‌ను చేర్చాలంటూ సెప్టెంబర్ 8న ఎన్నికల కమిషన్‌‌కు ఇచ్చిన ఉత్తర్వులను సవరించేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం సరైన నిబంధనలను పాటించిందని భావిస్తున్నట్లు పేర్కొన్నది. డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డులు, డాక్యుమెంటు ఫోర్జరీ కావొచ్చని అభిప్రాయపడింది. ఆధార్ కార్డు వ్యాలిడ్ అని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. కాగా, బిహార్​లో సర్​ను వ్యతిరేకిస్తూ ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)తో పాటు పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున అడ్వకేట్లు వాదనలు వినిపించారు. ఈసీ తన మాన్యువల్స్, రెగ్యులేషన్లు పాటించడంలేదని, అభ్యంతరాలు అప్‌‌లోడ్ చేయడంలేదని వాదించారు. సర్​పై రోజువారీ బులిటెన్ రిలీజ్ చేసేలా ఈసీని ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. ఈసీఐ తరఫున సీనియర్ అడ్వకేట్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. వారానికి ఒకసారి అప్​డేట్స్ ఇస్తున్నామని, రోజువారీ బులిటెన్ సాధ్యంకాదని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. తుది వాదనలను అక్టోబర్ 7న వింటామని తెలిపింది.