గడువు విధించొద్దు సరే.. బిల్లులు పెండింగ్పెడితే చూస్తూ ఉండల్నా..? సుప్రీంకోర్టు

గడువు విధించొద్దు సరే.. బిల్లులు పెండింగ్పెడితే చూస్తూ ఉండల్నా..? సుప్రీంకోర్టు
  • బిల్లులకు ఆమోదం విషయంలో గడువు విధించడంపై సుప్రీంకోర్టు కామెంట్
  • గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించే అధికారం కోర్టులకు లేదంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల వాదన
  • ఉభయ సభలు ఆమోదం తెలిపి పంపించినా గవర్నర్  ఆపేస్తే అర్థమేంటని ప్రశ్నించిన కోర్టు
  • మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తరఫున వాదనలు వినిపించిన లాయర్లు

న్యూఢిల్లీ:  అసెంబ్లీ, మండలి.. ఉభయ సభలూ పాస్ చేసి పంపిన బిల్లును ఆమోదం తెలపకుండా గవర్నర్ నిరవధికంగా పెండింగ్‎లో పెట్టినా కోర్టులు కల్పించుకోకూడదా అంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది. బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించే అధికారం కోర్టులకు లేదనే విషయాన్ని అంగీకరిస్తామని చెప్పింది. అయితే, రాష్ట్రంలోని ఉభయ సభలూ, రెండుసార్లు పాస్ చేసి పంపిన బిల్లుకు ఆమోదం తెలపకుండా గవర్నర్ ఆపేయడంలో అర్థమేముందని నిలదీసింది. 

అలాంటి సందర్భాల్లో కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా..? అని ప్రశ్నించింది. ఈమేరకు గవర్నర్లు, ప్రెసిడెంట్‎కు కోర్టు గడువు విధించవచ్చా అంటూ దాఖలైన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్​నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇందులో జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్​ఉన్నారు. 

ఈ క్రమంలోనే గవర్నర్లు, రాష్ట్రపతి స్వయం ప్రతిపత్తికి కోర్టులు భంగం కలిగించకూడదని, బిల్లుల ఆమోదం విషయంలో కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేవని, గడువు విధించలేవని బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాల తరఫున లాయర్లు మంగళవారం వాదనలు వినిపించారు. అన్ని వ్యాధులకూ న్యాయస్థానాలు మాత్రమే మందు కాలేదని వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఒకవేళ బిల్లులను ఆపేసే అధికారాన్ని రాజ్యాంగం గవర్నర్లు, ప్రెసిడెంట్‎కు కట్టబెట్టిందని కాసేపు అనుకుంటే, ద్రవ్య బిల్లును కూడా గవర్నర్ ఆపేస్తే ఏంచేస్తారని ప్రశ్నించింది.

అయితే, మిగతా బిల్లులకు, మనీ బిల్లుకు వ్యత్యాసం ఉందని, మనీ బిల్లును ఆపేసే పరిస్థితి తలెత్తదని మధ్యప్రదేశ్​ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన లాయర్ నీరజ్ కిషన్ కౌల్​వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని పార్లమెంట్‎కు వదిలేయాలని, కోర్టులు తమకు తాముగా కల్పించుకుని రాజ్యాంగాన్ని మార్చలేవని కౌల్​పేర్కొన్నారు. ఓ బిల్లును ఎందుకు ఆపారని గవర్నర్ ను ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉందని జస్టిస్ నరసింహ పేర్కొనగా.. ఆర్టికల్ 361ను ఉదహరిస్తూ, గవర్నర్లు, రాష్ట్రపతి ఏ న్యాయస్థానానికీ జవాబుదారీ కాదని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన లాయర్ హరీశ్​ సాల్వే కోర్టుకు తెలిపారు. 

అసెంబ్లీ పాస్ చేసి పంపించిన బిల్లుపై మీ నిర్ణయమేంటని గవర్నర్లను కోర్టులు ప్రశ్నించవచ్చు కానీ ఆ నిర్ణయానికి కారణమేంటని అడగలేదని వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో అసెంబ్లీలు పాస్ చేసిన బిల్లుల విషయంలో నిర్ణీత కాలం తర్వాత వాటికి గవర్నర్ ఆమోదం పొందినట్లు భావించే సదుపాయంలేదన్నారు. రాజ్యాంగంలో రాష్ట్రాలకు ఈ వెసులుబాటు కల్పించలేదని హరీశ్ సాల్వే పేర్కొన్నారు.