పంజాబ్, తమిళనాడు​ గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

పంజాబ్, తమిళనాడు​ గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్, తమిళనాడు గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పంజాబ్ ​ప్రభుత్వం గవర్నర్​పై వేసిన పిటిషన్​ను శుక్రవారం మరోసారి విచారించింది. ‘‘ఎన్నో ఏండ్లుగా మన దేశం సంప్రదాయాల ప్రకారం నడుస్తోంది. వాటిని అనుసరించాల్సిన అవసరం ఉంది’ అని బెంచ్​ అభిప్రాయపడింది. 

ఈ సందర్భంగా బిల్లులకు ఆమోదం తెలపకపోవడంపై పంజాబ్ గవర్నర్​ను ఉద్దేశిస్తూ.. ‘మీరు నిప్పుతో ఆడుతున్నారు’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశం రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ పేర్కొనడాన్ని తప్పుపట్టింది. ఇదే సమయంలో ప్రొరోగ్ చేయకుండా అసెంబ్లీని ఎందుకు వాయిదా వేశారని అటు పంజాబ్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. పంజాబ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. 

ఈ వ్యవహారంపై అసంతృప్తితో ఉన్నామని తెలిపింది. ఇటీవల జరిగిన వాదనల సమయంలోనూ గవర్నర్ జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులం కాదనే వాస్తవాన్ని గవర్నర్లు మరిచిపోవద్దని పేర్కొంది. ఈ విషయంపై గవర్నర్లు తమ పనితీరుపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.