ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీం తీర్పు విచారకరం: ఆర్ కృష్ణయ్య

ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీం తీర్పు విచారకరం: ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విచారకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. సోమవారం హైదరాబాద్​లో కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. 75 ఏండ్లుగా న్యాయ, రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థలలో అగ్రకులాలకు చెందినోళ్లే ఉన్నారని, అలాంటప్పుడు రిజర్వేషన్లు కల్పించడంలో హేతుబద్ధత ఏంటని ప్రశ్నించారు.

అగ్రకులాలలోని పేదలకు రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఇస్తారు? ఉద్యోగాలలో జనాభా ప్రకారం ప్రాతినిథ్యం లేదని ఇస్తారా? చదువుల్లో అగ్రకులాలవాళ్లు లేరని ఇస్తారా? వారికి సమాజంలో గౌరవం లేదని ఇస్తారా? అని కృష్ణయ్య ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్  కోటాపై 11 మంది సుప్రీంకోర్టు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం విచారణకు  రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. గతంలో మండల్ కమిషన్ కేసు సందర్భంగా 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్లపై  50% గరిష్ట పరిమితిని విధించిందని గుర్తుచేశారు. ఇపుడు సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్​కు రిజర్వేషన్లు 10% కల్పించడంతో గరిష్ట పరిమితి 60%కి పెరిగినట్లయిందన్నారు.