
ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శ్రీనివాసరావు హత్య కేసులో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమనాథ్లతో కూడిన బెంచ్ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించింది. అడవుల వ్యవహారాలపై సుప్రీంకోర్టులో న్యాయసలహాదారుగా ఉన్న.. న్యాయవాది ఏడిఎన్ రావు ఈ ఘటనను సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు.
గత కొన్ని రోజుల క్రితం ప్లాంటేషన్‌లో పశువులను మేపొద్దన్నందుకు గొత్తికోయలు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై వేట కొడవలితో దాడి చేశారు. చత్తీస్‌గఢ్ నుంచి చాలా కాలం కింద వలస వచ్చిన గొత్తికోయలకు చెందిన పశువులు మొక్కలను మేస్తుండడంతో వాటిని బయటకు తోలాలని శ్రీనివాసరావు చెప్పారు. దీంతో వారు అతనితో వాగ్వాదానికి దిగారు. సర్వే చేయకుండానే ప్లాంటేషన్లు ఏర్పాటు చేస్తున్నారని, మీ వల్లనే మాకు అన్యాయం జరుగుతోందంటూ వాదించారు. అనంతరం సెక్షన్ ఆఫీసర్, వాచర్ పశువులను బయటకు కొడుతుండగా రేంజర్ వీడియో తీస్తూ నిలబడ్డారు. వెంటనే శ్రీనివాసరావు వెనక నుంచి వచ్చిన గొత్తికోయలు మెడ మీద వేటకొడవలి లాంటి కత్తితో దాడి చేశారు. దీంతో స్పృహ కోల్పోయిన శ్రీనివాసరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. విధి నిర్వహణలో ఉన్న ఆఫీసర్లపై దాడులను సహించబోమని స్పష్టం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎటువంటి జంకు లేకుండా విధులు నిర్వర్తించాలని సీఎం సూచించారు. శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు వారి ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం ప్రకటించారు. శ్రీనివాసరావు రిటైర్మెంట్‌వయసు వరకు నెలనెలా పూర్తి జీతం ఆయన కుటుంబీకులకు అందించాలని ఆదేశించారు.