మీరెప్పుడైనా ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేస్తుంటే.. డబ్బులు రాకుండానే బ్యాలెన్స్ కట్ అయినట్లు మెసేజ్ వచ్చిందా..? ప్రతి ఒక్కరికీ ఇది జరగకపోయినా చాలా మంది ఫేస్ చేసిన సమస్యే ఇది. కొన్ని సార్లు బ్యాంకు తిరిగి డబ్బులు చెల్లించినా.. కొన్ని సార్లు సవా లక్ష కారణాలతో చేతులెత్తేస్తుంటాయి. అలాంటప్పుడు బ్యాంకు ఉద్యోగులతో గొడవ పడలేక.. లీగల్ గా ఎలా ఎదుర్కోవాలో తెలియకా.. అంత టైమ్ లేక వదిలేస్తుంటారు చాలా మంది. కానీ ఇతడు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా దాదాపు తొమ్మిదేళ్లుగా పోరాటం చేసి.. ఎంతో మందికి మార్గదర్శకుడయ్యాడు.
గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఒక వ్యక్తి చేసిన పోరాటం పదివేలకు 3 లక్షల రూపాయలు ఇచ్చేలా చేసింది. 9 ఏళ్ల పోరాటానికి అతడికి వచ్చింది తక్కువే అయినా.. బ్యాంకుల నిర్లక్ష్య వైఖరిని వెలుగులోకి తీసుకొచ్చి.. ఎలా న్యాయం పొందాలో మార్గనిర్దేశం చేసినట్లయింది. ఎన్నో మెయిల్స్, లెటర్స్, అభ్యర్థనల తర్వాత.. కస్టమర్ కు బ్యాంకు 30 రెట్లు చెల్లించాల్సిన తప్పనిపరిస్థితి ఏర్పడింది.
2017 ఫిబ్రవరి 18 న గుజరాత్ లోని సూరత్ ఉధ్నా ఏరియాలో ఒక కస్టమర్ ఎస్బీఐ ఏటీఎంలో 10 వేల రూపాయలు విత్ డ్రా చేశాడు. డబ్బులు రాలేదు కదా కనీసం ప్రింట్ రిసీప్ట్ కూడా రాలేదు. కానీ డబ్బులు కట్ అయినట్లు నిమిషం తర్వాత మెసేజ్ వచ్చింది.
పట్టించుకోని బ్యాంకు:
డబ్బులు రాకుండానే బ్యాలెన్స్ కట్ అవ్వడంతో.. దుంబ్రాల్ ఏరియాలోని తన హోమ్ బ్రాంచ్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి ఫిర్యాదు చేచశాడు. ఫిబ్రవరి 21న ఫిర్యాదు చేయగా చూస్తామని నెలలు గడిపేశారు సిబ్బంది. ఆ తర్వాత 2017 మే నుంచి ఈ ఎన్ని ఈమెయిల్స్ పంపినా రెస్పాన్స్ రాలేదు. దీంతో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అదే విధంగా సీసీటీవీ ఫూటేజ్ ఇవ్వాల్సిందిగా SBI బ్యాంకుపై ఆర్టీఐ వేశాడు. కానీ ఎక్కడా కూడా తనకు సంతృప్తికరమైన సమాధానం, పరిష్కారం లభించలేదు. దీంతో 2017, డిసెంబర్ లో కన్జూమర్ ఫోరం ను ఆశ్రయించాడు.
కేసు వాదనల సందర్భంగా ఏటీఎం ఎస్బీఐ కి చెందినదని.. తమకు సంబంధం లేదని బ్యాంక్ ఆఫ్ బరోడా వాదించింది. రికార్డ్స్ లో ట్రాన్జాక్షన్ సక్సెస్ ఫుల్ అయినట్ఉల చూపిస్తుందని.. బ్యాంకు బాధ్యత వహించదని చెప్పింది. బ్యాంక్ ఆఫ్ బరోడా వాదనలను కన్జూమర్ ఫోరం తిరస్కరించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రీఫండ్ 5 రోజులలో చేయాల్సిందిగా ఆదేశించింది.
వడ్డీతో సహా ఇప్పించిన కోర్టు:
కన్జూమర్ కోర్టు కస్టమర్ కు వడ్డీతో సహా పేమెంట్ చేయాల్సిందిగా ఆదేశించింది. పది వేలకు ఏడాదికి 9 శాతం వడ్డీ, ఆలస్యం అయినందుకు పరిహారంగా రోజుకు 100 రూపాయల చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. 2026, ఫిబ్రవరి 26 నుంచి ఇప్పటి వరకు మొత్తం 3 వేల 288 రోజుల డిలే అయినట్లు తేల్చారు. దీంతో కస్టమర్ కు 3 లక్షల 28 వేల 800 రూపాయల పరిహారం చెల్లించారు. అంతేకాకుండా.. మానసిక వేధన కలిగించినందుకు 3 వేలు, లీగల్ ఖర్చులకు 2 వేల రూపాయలు ఇవ్వాలని తీర్పునిచ్చింది. డబ్బులు ఎంత వచ్చాయనేది కాకుండా.. తన పోరాటానికి న్యాయం జరిగిందని ఆ కస్టమర్ ఆనందం వ్యక్తం చేశాడు.
