మిచెల్‌‌కు క్షమాపణ చెప్పా: సూర్య

మిచెల్‌‌కు క్షమాపణ చెప్పా: సూర్య

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్లో అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ బాల్‌‌ విసిరిన ఉదంతంలో డారిల్‌‌ మిచెల్‌‌కు తాను వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పానని టీమిండియా కెప్టెన్‌‌ సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ వెల్లడించాడు. మంచి నాయకత్వానికి ఉదాహరణగా నిలవాలనే ఉద్దేశంతోనే తాను అలా వ్యవహరించానన్నాడు. ‘ఆవేశంలో కొన్నిసార్లు అలా జరుగుతుంది. ఆ టైమ్‌‌లో ఏం జరుగుతుందో కూడా పూర్తిగా అర్థం కాదు. కానీ ఆ తర్వాత నేను అర్ష్‌‌దీప్‌‌తో అలా చేయకూడదని చెప్పా. అప్పుడు వెళ్లి మిచెల్‌‌తో మాట్లాడాడు. 

అది సరదాగా ముగిసిపోయింది. మిచెల్‌‌ కూడా తేలికగానే తీసుకున్నాడు. అయినప్పటికీ నేను స్వయంగా వెళ్లి మిచెల్‌‌కు సారీ చెప్పా. ఎందుకంటే ఒక నాయకుడిగా గ్రౌండ్‌‌లో మనం ఎలా వ్యవహరిస్తామనేది కూడా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు మనల్ని గమనిస్తుంటారు’ అని సూర్య పేర్కొన్నాడు. అయితే ఈ సంఘటనలో అర్ష్‌‌దీప్‌‌ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి పని చేయలేదన్నాడు. యాదృచ్ఛికంగా అలా జరిగిపోయిందని సూర్య చెప్పాడు.