ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్ ఆసక్తికరంగా మారింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం (నవంబర్ 06) జరిగే నాలుగో టీ20లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించి 1–1తో సమంగా నిలవడంతో గోల్డ్‌కోస్ట్‌లోని కరారా ఓవల్ వేదికగా జరిగే ఈ పోరు కీలకం కానుంది. గత మ్యాచ్‌లో అద్భుతమైన విజయం సాధించడంతో ఇండియా ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు సొంతగడ్డపై ఆధిపత్యం చూపించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ కు ముందు కెప్టెన్ సూర్య.. వైస్ కెప్టెన్ గిల్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నారు.
సూర్య ఫామ్ లోకి రాకపోతే కష్టం:
టీ20 స్పెషలిస్ట్ గా.. విధ్వంసకర ఆటగాడిగా పేరున్న సూర్య ఫామ్ లేకపోవడం భారత జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. భారత జట్టు టీ20జట్టు కెప్టెన్సీ అప్పగించిన దగ్గర నుంచి సూర్య బ్యాటింగ్ లో పెద్దగా రాణించడం లేదు. ఎప్పుడో ఒకసారి మెరుస్తున్నా నిలకడగా రాణించడంలో విఫలమవుతున్నాడు. జట్టు విజయాలు సాధిస్తున్నా.. ఈ టీమిండియా కెప్టెన్ ఫామ్ పై ఆందోళన అలాగే ఉంది. ఆసియా కప్ లో ఘోరంగా విఫలమైన సూర్య.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లోనూ తన చెత్త ఫామ్ కొనసాగిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముందు సూర్య ఫామ్ లోకి రావడం చాలా ముఖ్యం. కీలకమైన ఈ మ్యాచ్ లో విఫలమైతే అతని కెప్టెన్సీ కే ప్రమాదం పొంచి ఉంది.
గిల్ కు చివరి ఛాన్స్:
టీ20 వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్ ఫామ్ మాత్రం ఇండియాను కలవరపెడుతోంది. గత ఆరు ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌ల్లో గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం. ఈ టూర్‌లో వన్డే సిరీస్ నుంచి అతను వరుసగా 10, 9, 24, 37*, 5,15 స్కోర్లు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. కాన్‌బెరాలో తొలి టీ20లో మాత్రమే కెప్టెన్ సూర్యతో కలిసి కాస్త మెప్పించాడు. గత రెండు ఇన్నింగ్స్‌ల్లో మళ్లీ ఫెయిలైన గిల్ త్వరగా గాడిలో పడాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఓవైపు వరల్డ్ నంబర్ వన్ అభిషేక్ అద్భుతంగా ఆడుతుండగా.. మరో ఎండ్‌లో శుభ్‌మన్ తడబాటు వల్ల జట్టుకు శుభారంభాలు లభించడం లేదు. సిరీస్ లో అత్యంత కీలకమైన ఈ పోరులో అయినా తను మెప్పించకపోతే జట్టులో స్థానం కోల్పోయిన ఆశ్చర్యం లేదు.
బలంగానే భారత జట్టు:
గత మ్యాచ్‌లో అద్భుతమైన విజయం సాధించడంతో ఇండియా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆ విక్టరీతో మన టీ20 బ్యాటింగ్ డెప్త్ మరోసారి రుజువైంది. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ నిలకడగా రాణిస్తూ సిరీస్‌లో 167.16 స్ట్రైక్ రేట్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అతని ఫామ్ టీమ్ ప్రధాన బలం. మరోవైపు, గత మ్యాచ్‌లో జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు బ్యాటింగ్‌తో పాటు, బౌలింగ్‌లోనూ రాణించి మ్యాచ్‌ను ఇండియా వైపు తిప్పాడు. కుల్దీప్ యాదవ్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసినా.. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి రావడంతో బౌలింగ్ కాంబినేషన్ మెరుగైంది. అయితే, శివమ్ దూబే గత మ్యాచ్‌లో (3 ఓవర్లలో 43) ఎక్కువ రన్స్ ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆల్-రౌండర్ కోటాలో గాయం నుంచి కోలుకున్న నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకునే చాన్సుంది.
